మేడారంలో కలెక్టర్‌ పర్యటన

Wed,November 13, 2019 03:08 AM

తాడ్వాయి, నవంబర్‌12: మేడారాన్ని కలెక్టర్‌ చింతకుంట నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. మేడారంలో 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే మహాజాతరలో భాగంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, డీఆర్వో రమాదేవితో కలిసి భూములను మంగళవారం పరిశీలించారు. నార్లాపూర్‌ సమీపంలోని చింతల్‌క్రాస్‌ వద్ద పార్కింగ్‌ ఏరియాను చూశారు. అనంతరం మేడారం చేరుకున్నారు. చిలకలగుట్ట, ఆదివాసీ మ్యూజియం, ఆర్టీసీ బస్టాండ్‌, గద్దెల పరిసరాల్లో ప్రభు త్వ భూములను పరిశీలించారు. ఏ ఏ ప్రాంతాల్లో ఏ సౌకర్యాలు కల్పిస్తే భక్తులకు ఉపయోగపడుతాయో తెలుసుకున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ సతీష్‌కుమార్‌తో మాట్లాడారు. జాతర సందర్భంగా ఆ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే సౌకర్యాలను తెలుసుకున్నారు. జాతర, జాతర అనంతరం భక్తులకు ఉపయోగపడేలా ఏర్పాటు చేయాలని సూచించారు. జాతర కోర్‌ ఏరియాలో వాటర్‌ ట్యాంకులను నిర్మించి నీటి సరఫరా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గద్దెల వెనకాల భూములను పరిశీలించారు. రెడ్డిగూడెం సమీపంలోని గుట్టపై ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ భూమిని చూశారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న డంపింగ్‌ యార్డు పనులను నిలిపి వేసి మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జంపన్నవాగు వద్దకు చేరుకొని వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంను పరిశీలించారు. ఇక్కడ ప్రమాదాలు జరిగి భక్తులు మరణిస్తున్నారని రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. చెక్‌డ్యాంల వద్ద 3 ఫీట్ల లోతులో నీరు నిలిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెక్‌డ్యాంలతో నీరు నిలిచి కొత్తూరు నుంచి రెడ్డిగూడెం వచ్చే లో లెవల్‌ వంతెన మునుగుతోందని, తద్వారా భక్తులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున నూతన వంతె న నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

కొంగల మడుగు ప్రాంతంలో పర్యటించి, ప్రభుత్వ భూములను పరిశీలించారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చే సమయంలో పూజలు నిర్వహించే చలపయ్య చెట్టు వద్ద గుడిని పరిశీలించారు. అక్కడ పూజలు నిర్వహించేందుకు 4 ఎకరాల భూమిని కేటాయించాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు కలెక్టర్‌ను కోరారు. వీఐపీ పార్కింగ్‌ నుంచి గద్దెల వద్దకు వచ్చే రోడ్డుకు మరమ్మతులు చేయాలని జగ్గారావు కోరగా, కలెక్టర్‌ ఆ రోడ్డును పరిశీలించారు. గద్దెల ఆవరణలో మంచెపైకి ఎక్కి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వచ్చిపోయే మార్గాలను, భక్తులు సమర్పించిన కొబ్బరిముక్కలు, బెల్లాన్ని తరలించే మార్గాలను జాతర కార్యనిర్వాహణ అధికారి రాజేంద్రంను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తు తం ఉన్న క్యూలైన్‌లను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని, క్యూ లైన్‌ల మధ్యలో మరుగుదొడ్లు నిర్మిస్తే బాగుటుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఈవోకు సూచించారు. అనంతరం కలెక్టర్‌ ఎస్పీ, డీఆర్వోలతో కలిసి సమ్మక్క - సారలమ్మలను దర్శించుకొని, గిరిజన సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్‌, ఎస్పీల రాక సందర్భంగా ఆలయ పూజారులు గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. వారి వెంట ములుగు ఏఎస్పీ సాయిచైతన్య, ములుగు సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి, పస్రా ఎస్సై మహేందర్‌కుమార్‌, తాడ్వాయి-2 ఎస్సై గణి, పీఎస్‌ఐ సురేశ్‌, తహసీల్దార్‌ భిక్షం ఉన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles