కాళేశ్వరంలో భక్తుల పూజలు

Mon,November 11, 2019 01:29 AM

కాళేశ్వరం, నవంబర్ 10 : కార్తీక మాసానికి తోడు ఆదివారం సెలవు దినం కావడంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం ఆలయ అర్చకులు గోదావరికి మంగళవాయిద్యాలు, కలశాలతో వెళ్లి గోదావరి నీటిని తెచ్చి స్వామి వారికి అభిషేకం చేశారు. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్ తదితర జిల్లాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీష్‌గఢ్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచే భక్తులు త్రివేణి సంగమ గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మహిళలు కార్తీక మాసం సందర్భంగా గోదావరిలో దీపాలు వదిలి, సైకత లింగాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయానికి చేరుకుని శని, కాలసర్పదోష నివారణ పూజలు చేశారు. అక్కడి నుంచి కాళేశ్వరముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శుభనందదేవి (పార్వతి అమ్మవారు)ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ అర్చకులు కుంకుమార్చన పూజలు చేశారు. అలాగే ఆలయంలోని తులసి, మారేడు చెట్టుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రదక్షిణలు చేసి, లక్ష వత్తులు వెలిగించారు. వివిధ పూజలు, లడ్డు, పులిహోరా ద్వారా రూ.06 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles