గిరిజన విద్యాలయాలకు పవర్

Sat,November 9, 2019 05:50 AM

-పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10.51 కోట్లు మంజూరు
-దేశంలోనే తొలిసారి ఏటూరునాగారం ఐటీడీఏకు అవకాశం
-ఇక విద్యాసంస్థల్లో డిజిటల్ తరగతులు, సోలార్ వెలుగులు, మెరుగైన వసతులు
-ఒప్పంద పత్రాలపై పీవో సంతకాలు
-పది నెలల్లో మారనున్న రూపురేఖలు

ఏటూరునాగారం, నవంబర్ 08: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరిన్ని మెరుగైన వసతి సౌకర్యాల కల్పన కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10.51 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలంగాణ, జార్ఖండ్ రాష్ర్టాల పీవో రమేశ్, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు నిధుల వినియోగంపై అగ్రిమెంట్లు చేశారు. ఈ మేరకు ఇద్దరు అధికారులు పత్రాలపై శుక్రవారం సంతకాలు చేశారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ చొరవతోనే నిధులు మంజూరైనట్లు ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు ఈ మేరకు ఒప్పందాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు నిధుల మంజూరు విషయమై ఎంపీ పసునూరి దయాకర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. దీంతో ఐటీడీఏ నుంచి అవసరమైన నిధులతో ప్రతిపాదనలు పంపించగా..ఎంపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు అంగీకరించి ఐటీడీఏకు సమాచారం అందజేశారని పీవో వెల్లడించారు. ఈ సందర్భంగా పీవో పసునూరి దయాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంజూరు చేసిన నిధులను పది నెలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని 24 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు, వాటర్ హీటర్స్, సోలార్ ప్యానల్ రూఫ్ టాప్స్, సోలార్ వాటర్ పంపింగ్ సిస్టం, వాటర్ ప్లాంట్లు, పాఠశాల ఆవరణలో హైమాస్ట్ లైట్లు, స్టడీ లాంతర్లు, సోలార్ పవర్ బ్యాంకు సిస్టాన్ని ఏర్పాటు చేయనున్నారు. నీతి అయోగ్ గైడ్ లైన్స్ ప్రకారం ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాఠశాలకు నిధులు మంజూరు చేశారు. వీటికి సంబంధించి బాండ్ పేపర్లపై ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పీవో రమేశ్ సంతకాలు చేశారు. డీటీడీవో ఎర్రయ్య, గిరిజన సంక్షేమశాఖ ఈఈ మురళీ మోహన్ సాక్షులుగా సంతకాలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నర్సింహ, డీఈఈ మధుకర్, మేనేజర్ లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

దేశంలోనే తొలిసారిగా..
దేశంలోనే తొలిసారిగా ఏటూరునాగారం ఐటీడీఏకు నిధులు మంజూరు చేయడం జరిగిందని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలంగాణ, జార్ఖండ్ రాష్ర్టాల పీవో రమేశ్ తెలిపారు. ముందుగా పంపించిన డీపీఆర్‌ను పరిశీలించి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. తమ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టులకు సైతం రుణాలు ఇస్తున్నామన్నారు. కార్పొరేషన్‌కు వచ్చిన ఆదాయంలో రెండు శాతం నిధులు సామాజిక సేవలో భాగంగా ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ ఐటీడీఏకు నిధులు మంజూరు చేయడం తమ సంస్థకు మైల్ స్టోన్ లాంటిదని, ఇక్కడ సక్సెస్ అయితే మరింత ముందుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. విద్యావైద్యంపై తాము ప్రత్యేక దృష్టి పెడుతామన్నారు. పది నెలల్లో ఇచ్చిన నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుందని, పూర్తి క్వాలిటీగా పనులు జరుగుతాయని, తాము పనులను మానిటరింగ్ చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజీవ్ విద్యా మిషన్ గైడ్ లైన్స్ ప్రకారం పాఠశాలల్లో సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles