వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ : సంస్థ పరిధిలో సబ్స్టేషన్ల నిర్మాణాల్లో జాప్యాన్ని సహించేది లేదని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు హెచ్చరించారు. సంస్థ డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, నర్సింగారావు, గణపతి, సంధ్యా రాణితో కలిసి బుధవారం నక్కలగుట్టలోని విద్యుత్ భవన్లో 16 జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ విద్యుత్ అంతరాయం, కారణాలను విశ్లేషించి ని వారణ చర్యలపై దృష్టి సారించాలని చెప్పారు. సంస్థ పరిధిలో సారంగాపూర్, నిమ్మపెల్లి, బాన్సువాడ, కోటగిరి, కల్లూరు, భీం ఘన్పూర్, పద్మానగర్, చొప్పదండిల్లో నిర్మిస్తున్న 132 కేవీ సబ్స్టేషన్ల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పవర్వీక్లో మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ, హెచ్టీ, టీఎస్ఐపాస్, సర్వీసుల మంజూరులో జాప్యం చెయద్దని కోరారు. వ్యవసాయ కనెక్షన్లకు కావాల్సిన మెటీరియల్ జాబితా రూపొందించాలని, వీధిదీపాలకు తప్పనిసరిగా 100 శాతం విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయలన్నారు. సీజీఎంలు అశోక్ కుమార్, మధుసూదన్, నగేశ్, మోహన్రావు, సదర్లాల్, కిషన్, ప్రభాకర్, అశ్క్, తిరుపతి రెడ్డి, ట్రాన్స్కో సీఈ సంపత్, జీఎంలు వెంకటరమణ, వెంకటకృష్ణ పాల్గొన్నారు.