ట్రాక్టర్ల నిర్వహణకు ఉపాధి నిధులు

Thu,November 7, 2019 01:57 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : గ్రామ పంచాయతీలు ట్రాక్టర్ల నిర్వహణకు ఉపాధి నిధులు వినియోగించుకోవచ్చని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. తొలి విడుత జిల్లాలో 55 పంచాయతీలకు వివిధ కంపెనీల ట్రాక్టర్లను కొనుగోలు చేసి, హన్మకొండలోని జేఎన్‌ఎస్‌లో బుధవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జెడ్పీ ఇన్‌చార్జి చైర్మన్ ఆకుల శ్రీనివాస్, కలెక్టర్ ఎం హరితతో కలిసి ట్రాక్టర్లు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పల్లెలు మా రాయన్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.331 కోట్లు కేటాయిస్తుందని, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు రూ.662 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు అధికారాలు రానున్నాయని తెలిపారు. ట్రాక్టర్ నిర్వహణకు ఉపాధి నిధులు ఉపయోగించుకోవచ్చని, పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరికి ట్రాక్టర్ డ్రైవింగ్‌పై శిక్షణ ఇప్పించాలని సూచించారు. చెత్త సేకరణకు ఉపాధి నిధులు వాడుకోవచ్చని చెప్పారు. ట్రాక్టర్లను సొంతానికి వాడుకోవద్దని సూచించారు.

గ్రామాలాభివృద్ధికి దాతల సహకారం తీసుకోవాలన్నారు. వైకుంఠధామం, డంపింగ్ యార్డు ఉండేలా సర్పంచులు చర్యలు చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం చాలెంజింగ్‌గా ముందుకు వెళ్తున్నారని, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత కరెంట్, పంటల పెట్టుబడి కోసం ప్రతి సంవత్సరం రైతు బంధు పథకం నుంచి ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయం వంటివెన్నో పథకాలు అందులో భాగమేనని తెలిపారు. ధాన్యం రైతుకు ప్రభుత్వ మద్దతు ధర దక్కాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రూ.13 వేల కోట్ల వెచ్చించి రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పారు. గిట్టుబాటు ధర లభించక పత్తి రైతులు గోస పడుతుంటే కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తి కొనడం లేదని పేర్కొన్నారు. మద్దతు ధర రూ.5,550 ఉంటే.. రైతులు చివరకు తమ పత్తిని రూ.2 వేల నుంచి రూ.3 వేలలోపే వ్యాపారులకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. సిగ్గులేకుండా కేంద్రం వ్యవహరిస్తుందని, రైతుల నుంచి పత్తి కొంటలేరు గానీ ఆర్టీసీ సమ్మెను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన విరుచుకుపడ్డారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles