ఆర్టీసీ కార్మికులు మాయమాటలు నమ్మొద్దు..

Wed,November 6, 2019 02:35 AM

మహబూబాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రతిపక్ష పార్టీలు, స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్న యూనియన్‌ నాయకుల మాయమాటలు నమ్మి ఆర్టీసీ కార్మికులు మోసపోవద్దని, వెంటనే ఉద్యోగాల్లో చేరాలని గిరిజన స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ కోరారు. ఆర్టీసీ సమ్మె కార్మికుల భవిష్యత్‌పై మంగళవారం మహబూబాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్‌ యూనియన్‌ నాయకులు, అధికారులతో రోజంతా చర్చించారన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కుడా ఆర్టీసికి 43శాతం ఫిట్‌మెంట్‌, ఐఆర్‌ ఇచ్చి కార్మికుల వేతనాలు భారీగా పెంచారని చెప్పారు. యూనియన్ల స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికులను సమ్మెకు ఊసిగొల్పుతూ నష్టాల్లోకి తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో విలీనం తప్పా.. మిగిలిన డిమాండ్లపై చర్చించాలని హైకోర్టు సూచించినా ఆర్టీసీ యూనియన్లు వీలినమే ప్రధానమని మొండిపట్టు పట్టి కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో బలం లేని ప్రతిపక్ష పార్టీలు ఆర్టీసి సమ్మెను తమ రాజకీయ లబ్ధి కోరకు వాడుకుంటున్నాయని, దీనిని ఆర్టీసీ కార్మిక, ఉద్యోగ కుటుంబ సభ్యులు గుర్తించాలని కోరారు. తహసీల్దార్‌ విజయారెడ్డి మృతికి మంత్రి సత్యవతి రాథోడ్‌ సంతాపం తెలిపారు. ఎంపీ మాలోత్‌ కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఉద్యోగుల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి అని, ఆయన పిలుపుమేరకు స్వచ్ఛందంగా వచ్చి వెంటనే విధుల్లో చేరాలని కోరారు.

విద్యార్థుల పరిపూర్ణ రక్షణకు చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్‌,నమస్తే తెలంగాణ: ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినులకు పరిపూర్ణమైన రక్షణ కల్పించాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సమావేశ మందిరంలో ప్రభుత్వ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఆశ్రమ పాఠశాలల నిర్వహణ, బాలికల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి సమీక్షించారు. అధికారులందరూ బాలికల పాఠశాలలకు రక్షణ కవచంలా పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు.

ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ సోదరుడు మృతి
రాయపర్తి: ఊకల్‌ గ్రామ సమీపంలోని బాలాజీ తండాలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ సోదరుడు బానోతు కిషన్‌నాయక్‌ (75) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ తండాకు చేరుకుని కుటుంబ సభ్యులతో చేరి కిషన్‌నాయక్‌ మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా రోదించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎం పీ కవిత తదితరులు తండాకు చేరుకొని నివాళులర్పించారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles