వరంగల్‌పై సీఎం ప్రత్యేక దృష్టి

Mon,October 21, 2019 04:57 AM

-నెల రోజుల్లో కొత్త మాస్టర్ ప్లాన్
-కస్టమర్లు సంతోషపడేలా ధరలుండాలి
-ఓరుగల్లుకు దేశవ్యాప్త గుర్తింపు
-అన్ని రంగాల్లో అభివృద్ధి
-ప్రాపర్టీ షో సందర్శనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

సుబేదారి, అక్టోబర్20: హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హన్మకొండ నక్కలగుట్టలో క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రాపర్టీ షో ఆదివారంతో ముగిసింది. చివరి రోజు మంత్రి ఎర్రబెల్లి హాజరై స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం నిర్వాహకులను స్టాల్స్ వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చారిత్రక వరంగల్ నగరానికి దేశంలో మంచి గుర్తింపు ఉన్నదన్నారు. ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్ట్‌లతో వరంగల్ సిటీకి తాగునీటి వసతి, కాకతీయ శిల్ప సంపద, భద్రకాళీ అమ్మవారు, లక్నవరం, రామప్ప వంటి సరస్సులు, ఎన్నో పర్యాటక ప్రాంతాలు వరంగల్ సొంతమన్నారు. రాష్ట్రంలో రెండో నగరంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని చెప్పారు. భద్రకాళీబండ్ పనులు చివరి దశకు చేరాయని, ఔటర్‌రింగ్ రోడ్డు పనులు సాగుతున్నాయని తెలిపారు. కొత్త మాస్టర్ ప్లాన్‌పై నెల రోజుల్లో ఆమోదముద్ర పడుతుందని మంత్రి పేర్కొన్నారు.

విద్యా, పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాల్లో వరంగల్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలు, ఎమ్మెల్యేల సహకారంతో ఉమ్మడి వరంగల్ జిల్లా, నగర అభివృద్ధికి కృషిచేస్తానని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. వరంగల్ నగరంలో రియల్‌ఎస్టేట్ రంగం ఊపందుకుందని, పేరుగాంచిన కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తున్నాయన్నారు. సామాన్య ప్రజల సొంతింటి కల నెరవేరేందుకు ప్రాపర్టీ షో దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. సామాన్యులు సంతోషపడేలా ప్లాట్ల అమ్మకాలు ఉండాలని స్థానిక బిల్డర్లకు మంత్రి సూచించారు. మంత్రి వెంట క్రెడాయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌సాగర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కంది శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ, రాము, కార్పొరేటర్ రంజిత్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కేశవరావు, తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles