ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం

Thu,October 17, 2019 03:17 AM

-నిషేధం అమలుకు దాతలు ముందుకు రావాలి
-భావి తరాలకు బంగారు భవిష్యత్‌ను అందించాలి
-26వ తేదీ తర్వాత ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం
-కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి
-గ్రామాభివృద్ధికి రూ.లక్ష విరాళం అందించిన వెంకటరత్నమ్మ
-కిలో ప్లాస్టిక్‌కు కిలో సన్నబియ్యానికి విశేష స్పందన
-తొలి రోజు 2369.35 కిలోల వ్యర్థాల సేకరణ

ములుగు, నమస్తేతెలంగాణ: ములుగు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి వినూత్న ఆలోచనతో చేపట్టిన కిలో ప్లాస్టిక్‌కు కిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో సేకరించిన ప్లాస్టిక్‌ను ఆయా గ్రామపంచాయతీ ఆవరణలో తూకం వేసి ప్లాస్టిక్‌ను సేకరించిన ప్రజలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. ప్లాస్టిక్ నిర్మూలనకు కలెక్టర్ తీసుకున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన ఏర్పడంతో పాటు జిల్లా వ్యాప్తంగా బుధవారం మొదటి రోజు 2369.35 కేజీల ప్లాస్టిక్‌ను సేకరించారు. కలెక్టర్ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జెడ్పీ సీఈఓ పారిజాతం వాజేడు మండలంలో, జిల్లా వ్యవసాయ అధికారి కె.ఏ. గౌస్‌హైదర్ మంగపేట మండలంలో ప్రారంభించారు. అదేవిధంగా గోవిందరావుపేట మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు. ప్రత్యేకాధికారులు జిల్లా వ్యాప్తంగా 174 గ్రామపంచాయతీల్లో ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించి ప్రజలతో ప్లాస్టిక్ నిర్మూలన ప్రతిజ్ఞను చేయించారు. అదేవిధంగా వెంకటాపూర్ మండలంలో ఎంపీడీవో ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. ఏటూరునాగారం మండలంలో అధికారులు ప్లాస్టిక్‌ను సేకరించిన వారికి బియ్యం పంపిణీ చేశారు. వెంకటాపూర్ (నూగూరు) మండలంలో మండల ప్రత్యేకాధికారి డీసీవో కరుణాసాగర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ నివాసాలలోని ప్లాస్టిక్‌ను సేకరించి జీపీ కార్యాలయాల్లోకి తీసుకువచ్చి ప్లాస్టిక్‌కు బదులు సన్న బియ్యం తీసుకున్నారు. ఈ నెల 26వ తేది వరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నది.

ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం..
మానవాళి మనుగడ, పర్యావరణానికి ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్ భూతాన్ని తరిమేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. కిలో ప్లాస్టిక్‌కు కిలో సన్నబియ్యం అందించే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బండారి నిర్మలహరినాథం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి దాతలు ముం దుకురావాలన్నారు. దాతలు జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ అధికారికి నగదు రూపంలో కాని, డీడీ, చెక్ రూపంలో అందించాలన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన ఏర్పడాలని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ను బహిష్కరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. బుధవారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు కిలో ప్లాస్టిక్‌కు కిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ప్రజలు తమ వద్ద గల ప్లాస్టిక్‌ను అప్పగించి బియ్యం పొందాలన్నారు. ఈ నెల 26 తర్వాత ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీపావళి తర్వాత జిల్లాలో ప్లాస్టిక్ కనిపిస్తే భారీ జరిమానాలు విధించనున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు.

ప్లాస్టిక్ నిషేధానికి రూ.లక్ష విరాళం
అందజేసిన వెంకటరత్నమ్మ
జిల్లాలో ప్లాస్టిక్ నిషేధానికి చేపట్టిన కిలో ప్లాస్టిక్‌కు కిలో సన్నబియ్యం కార్యక్రమానికి బియ్యం సేకరించేందుకు, గ్రామ అభివృద్ధి కోసం ములుగు సర్పంచ్ బండారి నిర్మల అత్త బండారి వెంకటరత్నమ్మ రూ.లక్ష చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. జిల్లా లో ప్లాస్టిక్ నిషేధం కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభలో కలెక్టర్ పిలుపు మేరకు స్పందించిన వెంకటరత్నమ్మ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాతలు తమ సా యాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ములుగు అకౌంట్ నంబర్ 26 3410100068560 (ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఏఎన్‌డీబీ000 263 4,ఎంఐసీఆర్‌కోడ్ 506011 524), ఆంధ్రాబ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రమాదేవి, డీపీవో వెంకయ్య, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, తహసీల్దార్ గన్యానాయక్, ఎంపీడీవో రవి, ఈవోపీఆర్డీ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles