పంచాయతీ సిబ్బందికి భరోసా

Tue,October 15, 2019 03:41 AM

-ఇప్పటికే రూ. 2లక్షల బీమా పథకం అమలు
-ఏటా ప్రభుత్వమే ప్రీమియం చెల్లింపు
-కార్మికులకు వేతనాలు పెంపు
-జీవో జారీ చేసిన సర్కారు
-పార్ట్ టైం, ఫుల్ టైం, కాంటిజెన్సీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 8500
-జిల్లావ్యాప్తంగా 903 మందికి లబ్ధి
-వేతన పెంపుతో జీపీ కార్మికుల హర్షం
-500 జనాభా ఉన్న పంచాయతీకి ఇద్దరు సిబ్బంది

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో పార్ట్‌టైం, ఫుల్‌టైం, కాంటిన్‌జెన్సీ విధానంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల వేతనాలను పెంచుతూ సోమవారం పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ జీవో నంబర్ 63ని విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం, ఫుల్‌టైం కార్మికులు, ఉద్యోగుల వేతనాలను పెంచే విధంగా సంబంధిత పంచాయతీ అధికారులకు ఉత్తర్వులను జారీచేశారు. జిల్లాలోని తొమ్మిది మండలాల పరిధిలో 174గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం, ఫుల్ టైం కార్మికులు, ఉద్యోగులకు ఊరట చేకూర్చే విధంగా ప్రభుత్వం వారి వేతనాలను డబుల్ చేసేలా ఉత్తర్వులు జారీచేసింది. 30రోజుల గ్రామ ప్రణాళిక కార్యాచరణ విజయవంతం కావడంలో కీలకమైన పంచాయతీ సిబ్బందికి పంచాయతీరాజ్ ఉద్యమానికి ఆద్యుడైన ఎస్కేడే పేరిట టీఆర్‌ఎస్ సర్కారు రూ.2లక్షల జీవితబీమా పథకాన్ని ప్రకటించింది. వారి ప్రీమియం మొత్తాన్ని ఏటా ప్రభుత్వమే చెల్లిస్తూ కుటుంబాల్లో కొండంత ధీమా కల్పించింది.

దీనికితోడు గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల శ్రమను గుర్తించిన ప్రభుత్వం వారి శ్రమకు తగిన ఫలితాన్ని అందించే విధంగా వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. గ్రామపంచాయతీల్లో పార్ట్‌టైం, ఫుల్ టైం, కాంటిన్‌జెన్సీ, అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ రూ.4వేలు, రూ.5వేలు పొందుతున్న వేతనాలను రూ.8500కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల, ఉద్యోగుల వేతనాలను రెట్టింపు చేస్తూ నిర్ణయించడంపై జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వేతనాలు పెంచినందుకు రుణపడి ఉంటామని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

903మంది కార్మికులకు లబ్ధి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్మికుల, ఉద్యోగుల వేతనాల పెంపుతో జిల్లా వ్యాప్తంగాఉన్న 174 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న సుమారు 903మంది కార్మికులకు వేతనాల రెట్టింపు జీవో వర్తించనుంది. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ప్రభుత్వం రెట్టింపు చేసిన వేతన పరిధిలోకి రావడంతో గ్రామపంచాయతీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

500 జనాభాకు ఇద్దరు కార్మికులు..
జిల్లాలోని 174గ్రామపంచాయతీల్లో ప్రతీ 500జనాభాకు ఇద్దరు కార్మికుల చొప్పున నియమించేందుకు ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. గ్రామపంచాయతీలో నియమితులు కానున్న ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు తప్పనిసరి ట్రాక్టర్ నడిపించగల సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండాలని, మరొకరు గ్రామపంచాయతీకి సంబంధించిన అన్ని రకాల పనులను చక్కబెట్టే విధంగా అర్హత ఉన్న వ్యక్తులను నియమించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వీరికి ప్రతినెలా రూ.8500చొప్పున వేతనాలను చెల్లించేందుకు గ్రామపంచాయతీకి హక్కులను కల్పిస్తూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

హర్షం వ్యక్తం చేస్తున్న జీపీ కార్మికులు, ఉద్యోగులు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు రెట్టింపు చేస్తూ సోమవారం జీవో జారీచేయడంపై జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా నామమాత్రపు వేతనాలకు పనిచేసిన గ్రామపంచాయతీ కార్మికులు ప్రభుత్వం తమ వేతనాలను రెట్టింపు చేయడంపై సీఎం కేసీఆర్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రుణపడి ఉంటామని తెలిపారు.

133
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles