ప్రతి డిపోకు నోడల్ అధికారిని నియమించాలి

Tue,October 15, 2019 03:38 AM

జయశంకర్‌భూపాలపల్లి కలెక్టరేట్, ములుగు నమస్తే తెలంగాణ,అక్టోబర్ 14: ప్రతి ఆర్టీసీ డిపోకు గ్రూపు వన్ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించి సమ్మె సమయంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మతో కలిసి మంత్రి రవాణా ఏర్పాట్ల పై కలెక్టర్లు, పోలీస్, రవాణ , ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా బస్సుల రవాణా, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌ల విధుల మానిటరింగ్‌కు ప్రతి డిపోకు గ్రూపు వన్ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించి రవాణను సమీక్షించాలన్నారు. కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రజా రవాణాకు ఇబ్బందులు కలుగకుండా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం బస్సులు నడిచేలా చూడాలన్నారు. అలాగే బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేయకుండా చూడాలన్నారు. ఆర్టీసీ అధికారులకు సహాయంగా ఇతర ప్రభుత్వ శాఖల్లోని చురుకైన అధికారులను ఆర్టీసీకి డిప్యుటేషన్‌పై పంపించాలన్నారు.

బస్సు పాసులను అనుమతించాలని, పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జయశంకర్‌భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా జిల్లాలో సమయానికి బస్సులను నడిపిస్తున్నామన్నారు. పోలీసు శాఖ సహకారం బాగుందని, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఆర్టీసీ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చుతున్నారన్నారు.అలాగే ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, ప్రయాణికుల వద్ద నుంచి అధిక చార్జీలు వసూలు చేయకుండా ప్రతి బస్సులో చార్జీల వివరాలు చార్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో జయశంకర్‌భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ రాజమహేంద్రనాయక్, డీఎస్పీ కిరణ్‌కుమార్, ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీధర్మ, జిల్లా రవాణా శాఖాధికారి వేణుకుమార్, సీఐ వాసుదేవరావు, మలుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్, ఆర్టీసీ డిపో మేనేజర్, తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles