సమ్మేళనాలతో ప్రతిభ వెలుగులోకి..

Mon,July 15, 2019 01:28 AM

-టీఆర్‌ఎస్‌ హయాంలో కవులకు గుర్తింపు
-సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
కృష్ణకాలనీ, జూలై 14: కవి సమ్మేళనాలతో కవుల, కళాకారుల ప్రతిభకు గుర్తింపు దక్కుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో శ్రీవివేకానంద సాహితి కళాసేవారత్న సమితి చైర్మన్‌, కవి కొలుగూరి సంజీవరావు ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం, కవులకు సన్మానం, హరితహారంపై కవి సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ హరితహారంపై కవి సమ్మేళనం నిర్వహించడం సంతోషకరమైన విషయమన్నారు. కళారంగంలో భూపాలపల్లికి ప్రత్యేకత ఉందని, మహాద్భుతమైన కళలు ప్రదర్శించే కళాకారులు ఉన్నారని కీర్తించారు. ప్రతీ వ్యక్తిలో ఏదో ఒక కళ ఉంటుందని, దానిని వెలికి తీసిన వారే కళాకారులవుతారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కళాకారులకు పెద్ద పీట వేస్తున్నదని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో మరెన్నో కవి సమ్మేళనాలు నిర్వహించి కొత్త కవులను పరిచయం చేయాలని, వారిలోని ప్రతిభను వెలికి తీయాలన్నారు. 30 ఏళ్ల నుంచి కొలుగూరి సంజీవరావు భూపాలపల్లి ప్రాంతం నుంచి సాహితీ రంగానికి చేసిన సేవలను కొనియాడారు. సుమారు 10 నుంచి 15 సినిమాల్లో నటించి నటన రంగంతో పాటు పలు రంగాల్లో ప్రతిభ చూపారని, ఉద్యమంలో తన రచనలు, పాటల ద్వారా చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రతిభ చూపిన కవులు, కళాకారులకు మెమోంటో, ఇచ్చి శాలువాలతో సత్కరించారు. వృక్షాలపైన బండెలి చందర్‌ రావు పాడిన పాట సభికులను ఆలోచింపజేసింది. కార్యక్రమంలో కవులు తాళ్లపల్లి దామోదర్‌, కామిడి సతీష్‌రెడ్డి, లక్ష్మయ్య, రవి, బాబు, రమాదేవి, వాణిశ్రీ, రమ, మోతిరి దామోదర్‌, 120 మంది కవులు, కళాకారులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles