చెట్ల తొలగింపు..బల్దియాకు


Sat,December 14, 2019 03:42 AM

-జీహెచ్‌ఎంసీకి బాధ్యతలు అప్పగింత
-విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లకు సమీపంలోని చెట్లపై..
-పైలట్‌ ప్రాజెక్ట్‌గా బంజారాహిల్స్‌ సర్కిల్‌ ఎంపిక
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విద్యుత్‌శాఖలో అక్రమార్కుల పంటపండిస్తున్న చెట్ల తొలగింపు ప్రక్రియ ఇక నుంచి సులభతరం కాబోతున్నది. ఇష్టారీతిన చెట్ల కొమ్మలను తొలగించకుండా శాస్త్రీయంగా, యంత్రాల సహాయంతో చెట్ల కొమ్మలను తొలగించబోతున్నారు. ఇందుకు చెట్ల ప్రూనింగ్‌ ప్రక్రియను ఎంచుకుని అమలుచేయబోతున్నారు. ఇక నుంచి ఈ బాధ్యతలను జీహెచ్‌ఎంసీకి అప్పగించబోతున్నారు. ఇందుకు రంగం సిద్ధమవుతున్నది. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా బంజారాహిల్‌ సర్కిల్‌ను ఎంపికచేసి చెట్ల ప్రూనింగ్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే బంజారాహిల్స్‌ సర్కిల్లో అమలు తీరుతెన్నులను పరిశీలించి, అంతా సవ్యంగా ఉంటే దశల వారిగా చెట్ల ప్రూనింగ్‌ను అమలుచేయడంతో పాటు, ఈ బాధ్యతలను జీహెచ్‌ఎంసీకే అప్పగించబోతున్నారు.

జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనకు పచ్చజెండా..
చెట్ల ప్రూనింగ్‌ను తామే చేస్తామని నగరపాలక సంస్థ వర్గాల గత కొంతకాలంగా ప్రతిపాదిస్తూవస్తున్నాయి. ఈ బాధ్యతను తమకు అప్పగించాలని టీఎస్‌ఎస్‌పీడీఎల్‌ అధికారులకు కోరుతూ వస్తున్నాయి. ఇటీవలే నగర సమన్వయ సమావేశంలోనే ఈ విషయం చర్చకు వచ్చింది. తాము చెట్ల ప్రూనింగ్‌, ట్రిమ్మింగ్‌ చేస్తున్నామని, ఇదే పద్ధతిని డిస్కంలోను అమలుచేసే బాధ్యతలను తమకు బదలాయించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కోరారు. దీనిపై తీవ్రంగా కసరత్తు చేసిన డిస్కం అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించి బంజారాహిల్స్‌ సర్కిల్‌ల్లో అమలుచేసేందుకు పచ్చజెండా ఊపారు.

అక్రమాలకు చెక్‌పడేనా..
విద్యుత్‌ తీగలకు సమీపంలోని చెట్లు, చెట్ల కొమ్మల తొలగింపు ప్రక్రియ విద్యుత్‌శాఖలో అక్రమాలకు తావిస్తున్నది. అక్రమార్కుల పంట పండిస్తున్నది. పలు సర్కిళ్లల్లో చెట్లు తొలగించకుండానే లక్షల నుంచి మొదలుకొని కోట్ల వరకు బిల్లులు పాస్‌ చేయించుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కాంట్రాక్టర్లు, విద్యుత్‌శాఖ సిబ్బంది కుమ్మక్కుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొంత మంది కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆటలాడుకుంటున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నప్పుడు, వినాయక, దుర్గామాత నవరాత్రులప్పుడు చెట్లు, చెట్ల కొమ్మల తొలగించడం అనవాయితీగా వస్తున్నది. కాని ఈ ప్రక్రియ తూతూమంత్రంగా కొనసాగుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల చెట్లను తొలగించడం లేదని తెలుస్తున్నది. అంతే కాకుండా చెట్ల కొమ్మలను తెంపి రోడ్లమీదే పడేస్తున్నారు. నిబంధనల ప్రకారం చెట్లను తెంపిన తర్వాత వాటిని వాహనాల్లో ఎక్కించి, నిర్మానుష్యప్రాంతాల్లో పారేయడం లేదంటే జీహెచ్‌ఎంసీ డంపింగ్‌యార్డులకు చేర్చడం చేయాలి. కానీ గ్రేటర్‌లో అలా జరగడం లేదు. దీంతో కొమ్మలన్నీ రోడ్లమీదే పడి ఉంటున్నాయి. ఇది సమస్యాత్మకంగా మారుతున్నది. దీనిపై జీహెచ్‌ఎంసీ చెత్త తొలగింపు విభాగానికి ఫిర్యాదులందడం.. వారు వచ్చి తొలగించడం జరుగుతున్నది. దీనికి పరిష్కారంగా చెట్ల తొలగింపు ప్రక్రియను తమకే అప్పగించాలని గత కొంత కాలంగా జీహెచ్‌ఎంసీ కోరుతుండటం, డిస్కం అధికారులు గ్రీన్‌సిగ్నలివ్వడంతో అక్రమాలకు చెక్‌పడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles