దారి మళ్లాయి..


Fri,December 13, 2019 02:01 AM

-వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న ‘గృహ’ నల్లాలు
-అనుమతులు లేకుండానే కనెక్షన్లు
-ఇంటింటి సర్వేలో వెలుగులోకి..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ వ్యాప్తంగా అక్రమ నల్లాల డొంక కదులుతున్నది. అధికారుల అనుమతి లేకుండా బిగించుకున్న నల్లా, సివరేజీ కనెక్షన్ల లెక్కను తేల్చేందుకు గడిచిన కొన్ని రోజులుగా ప్రయోగాత్మకంగా ఆరు డివిజన్లలో ఇంటింటి సర్వే జరుపుతున్నారు. డొమిస్టిక్‌ ముసుగులో నల్లా కనెక్షన్లు పొంది వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న కనెక్షన్లపై ఈ సర్వేలో ప్రధానంగా దృష్టి సారించారు. ఒక పక్క ఇంటింటి సర్వేలో అక్రమ నల్లాల గుట్టును విప్పుతునే మరో పక్క అనధికారికంగా ఉన్న కనెక్షన్లను క్రమబద్ధీకరించుకునేందుకు వీడీఎస్‌ (వాలంటరీ డిస్‌క్లోజర్‌ స్కీం)ను ప్రవేశపెట్టారు. వచ్చే ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటింటి సర్వేలో 12వ తేదీ వరకు 67,458కనెక్షన్లపై సర్వే జరుపగా, అక్రమంగా 1,313 కనెక్షన్లు ఉన్నట్లు తేల్చారు. కేటగిరి మార్పు చేయాల్సినవి 9,830 కనెక్షన్లు ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. వీటిని తక్షణం సంబంధిత కనెక్షన్ల కేటగిరి మార్పు ద్వారా రూ.9.05కోట్ల ఆదాయం సంస్థకు సమకూర్చుతుందని అధికారులు తేల్చారు. దీంతో పాటు ఈ నల్లాలకు నెలవారీగా నీటి బిల్లుల రూపంలో రూ. 22 లక్షల మేర ఆదాయం రావొచ్చని అంచనా వేశారు.

సస్పెన్షన్లు...బదిలీలు
అక్రమ నల్లా, సివరేజి కనెక్షన్లను గుర్తించడం, సంస్థ లోపాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాయి. అయితే ఈ సర్వే లో ఇంటి దొంగల గుట్టు రట్టవుతున్నది. సంస్థ ఖజానాకు నష్టం చేస్తున్న ఇద్దరు లైన్‌మెన్లపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఇదే సమయంలో ఏండ్ల తరబడి ఒకే స్థానంలో పాతుకుపోయి అక్రమాలను ప్రోత్సహిస్తున్న లైన్‌మెన్లపై దృష్టి సారించారు. 500 మంది ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న లైన్‌మెన్లను ఒక చోటి నుంచి మరో చోటికి బదిలీ చేశారు. సంస్థకు సంబంధించిన రెగ్యులర్‌ లైన్‌మెన్లను బదిలీ చేయాలని తాజాగా నిర్ణయించారు. ప్రస్తుతం ఒకే చోట 25 సంవత్సరాలకు పైబడి పనిచేస్తున్న 30 మంది లైన్లమెన్లను మార్చారు. 20 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న లైనమెన్లకు రెండు రోజుల కిందట కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇతర చోటికి మార్చారు. 10 సంవత్సరాల పైబడి ఉన్న ప్రతి లైన్‌మెన్‌ను ఇతర సెక్షన్లను మార్చితే సంస్థకు మరింత ప్రయోజనం జరిగే అవకాశాలున్నాయన్న భావించి ఈ దిశగా చర్యలు చేపడుతున్నారు.

దీనికి బాధ్యులెవరు..?
బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌లో పేరొందిన ప్రముఖ హోటల్‌ అది..25ఎంఎం, 50ఎంఎం నల్లాలతో పాటు అదనంగా డొమెస్టిక్‌ కనెక్షన్లకు అధికారులు నీటి బిల్లులు జారీ చేస్తున్నారు. వాస్తవంగా పాతభవనం సమయంలో డొమెస్టిక్‌ నల్లాలు ఉండగా, ఆ స్థలంలో హోటల్‌ నిర్మాణం జరిగి చాలా సంవత్సరాలుగా హోటల్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాస్తవంగా 25ఎంఎ, 50 ఎంఎం నల్లాలకు నీటి బిల్లులు తీసుకోవాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో డొమెస్టిక్‌ నల్లా లేదు. కానీ డొమెస్టిక్‌ నల్లా ఉందంటూ పాత క్యాన్‌ నంబరుతో బిల్లులు జారీ చేస్తున్నారు. సదరు హోటల్‌ యాజమాన్యం కూడా నీటి బిల్లులు పరిశీలించకుండానే చెల్లించుకుంటూ వస్తున్నారు. కానీ ఇంటింటి సర్వేలో డొమెస్టిక్‌ నల్లా లేదని తేలింది. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, మీటర్‌ రీడర్‌ తప్పిదం వల్ల సదరు హోటల్‌ యాజమాన్యం భారీగా నష్టపోయింది. ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటున్న ఈ తరహా లోపాలకు ఏం చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే .

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles