అందరినోటా ఉల్లి జోక్స్..


Wed,December 11, 2019 03:40 AM

-కడుపుబ్బ నవ్వుకుంటున్న నెటిజన్లు
-వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లో..
-ఉల్లిపై పంచ్‌లు.. డైలాగులు
-ఖరీదైన యాపిల్ ఫోన్‌పై ఉల్లి లోగో
-ఉల్లిపాయలతో పెండ్లికూతురు నగలు..వడ్డానం
-తనకు కాబోయే వధువుకు బహుమతిగా ఉల్లి గిఫ్ట్
-రకరకాల క్రియేటివిటీతో పోస్టుల చక్కర్లు..
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :ఉల్లి ధరలు ఆకాశన్నంటి ప్రజలను హడలెత్తిస్తుంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఉల్లి నవ్వులు పూయిస్తుంది. నెటిజన్లు తమ క్రియేటివిటీ అంతా ఉల్లిపై చూపిస్తున్నారు. కామెడీ పండించే ఫొటోలు.. వీడియోలు.. స్లోగన్స్..తయారుచేసి సోషల్ మీడియాలో ఉల్లి పోస్టులు పెడుతున్నారు. తనకు కాబోయే భార్య కోసం ఓ వ్యక్తి అద్భుతమైన బహుమతి తయారు చేశాడు. అతడు ఆ బహుమతిని ఓ బాక్సులో పెట్టి ఆమెకు ఇచ్చాడు. ఆమె దానిని తెరిచి చూడగానే అందులో ఉల్లిగడ్డ ఉంటుంది. ఇంకో సంఘటనలో ఖరీదైన ఫోన్ అనగానే చాలా మందికి యాపిల్ గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు ఆ ఫోన్‌పై యాపిల్‌కు బదులు ఉల్లి లోగోను అమర్చిన ఫొటో అందరిని ఆకర్షిస్తుంది. మొత్తంగా సోషల్ మీడియాలో ఉల్లి హవా కొనసాగుతుంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్, టిక్‌టాక్‌లో ఉల్లి జోక్స్ పేలుతున్నాయి.

పోస్టులు..ఇలా..!!
-అహ నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాస్‌రావు కోడిని వేలాడ దీసి..దానిని చూస్తూ అన్నం తింటాడు. అదే మాదిరిగా ఉల్లిగడ్డను వేలాడ దీస్తూ అన్నం తింటున్నట్లుగా సోషల్ మీడియాలో ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.
-కూర వండుతున్న సమయంలో ఉల్లి వేయడానికి బదులు ఆ తాలింపునకు ఉల్లి వాసన చూపిస్తున్నట్లుగా టిక్‌టాక్‌లో వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి.
-బీరువాలు, లాకర్లను ఓపెన్ చేయగానే ఉల్లిగడ్డలు కనిపించే ఫొటోకు విపరీత లైకులు వస్తున్నాయి.
-ఓ అమ్మాయి రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ వెళుతుంది. ఆమెను నలుగురు కుర్రాళ్లు వెంబడిస్తున్నారు. ఆ యువతి భయపడి వేగంగా నడవడం మొదలుపెడుతుంది. అయినా వాళ్లు వెంబడిస్తూనే ఉంటారు. ఆ భయానికి ఆమె తన చేతులో ఉన్న ఉల్లిగడ్డల ప్యాకేజీని కిందపడేసి పరుగెడుతుంది. వెంటనే వాళ్లు ఆ ఉల్లిగడ్డలను తీసుకుని పారిపోతారు. అది చూసిన ఆ యువతి అయ్యే అంటూ అమాయకమైన చూపులు చూస్తుంది. ఈ వీడియో టిక్‌టాక్‌లో నెటిజన్లకు హాస్యాన్ని పండిస్తుంది.
-పేకాటలో డబ్బుకు బదులు ఉల్లిగడ్డలు పెట్టి నలుగురు కుర్రాళ్లు ఆడుతున్న ఫొటో విపరీతంగా షేర్ అవుతున్నది.
-బజాజ్ ఫిన్‌సర్వ్‌లో కొత్త ఈఎంఐ స్కీమ్ వచ్చిందంటూ..మీ కల ఆనియన్ అనే స్లోగన్‌తో ఉల్లిగడ్డలను అమర్చిన ఫొటో ఆకట్టుకుంటుంది.
-కాస్లీ వెడ్డింగ్ పేరుతో నవ వధువు ఉల్లి జడ వేసుకుని.. నడుముకు ఉల్లిగడ్డలతో వడ్డానం ధరించిన ఫొటో నవ్వులు పూయిస్తుంది. దండలు కూడా ఉల్లిదండలే కావడం విశేషం.
-నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. 2 ఉల్లిపాయలు దొరికితే పొగొట్టుకున్న వారికి అప్పగించిన మానవతా వాది.. అంటూ నలుగురు యువకులు దిగిన ఫొటో సోషల్ మీడియాలో కామెడీ పండిస్తుంది.
-ఆటో దిగాక..డబ్బులకు బదులు పెద్ద ఉల్లిగడ్డ డ్రైవర్‌కు ఇస్తే..చిల్లర కింద చిన్న ఉల్లిపాయలు తిరిగి ఇచ్చే వీడియో పొట్ట చెక్కలయ్యేలా నవ్వులు పంచుతుంది.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...