వాతావరణ మార్పులతో అప్రమత్తం..


Mon,December 9, 2019 12:53 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గత మూడు రోజులుగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో గ్రేటర్‌ వైద్య,ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఒక్కసారిగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలితీవ్రత పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యంగా స్వైన్‌ఫ్లూ వంటి డీసీజెస్‌ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో వాటిని నియంత్రించి, రోగులకు మెరుగైన వైద్యం అందించే దిశగా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. గాంధీలో ఇప్పటికే స్వైన్‌ఫ్లూ బాధితులకు చికిత్స నిమిత్తం నోడల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అధికారులు అనుమానిత రోగులకు వైద్యపరీక్షలు జరిపేందుకు నగరంలోని నల్లకుంట ఫీవర్‌, ఉస్మానియా, నిలోఫర్‌ దవాఖానల్లో రక్తపరీక్షల కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా నిలోఫర్‌లో కూడా ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కేసుల సంఖ్య పెద్దగా లేనప్పటికీ ముందుజాగ్రత చర్యగా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రోగి కుటుంబ సభ్యులతో పాటు స్వైన్‌ఫ్లూ వార్డుల్లో విధులు నిర్వర్తించే వైద్యసిబ్బందికి టీకాలు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. చలి ప్రభావంతో చిన్నారుల్లో వచ్చే నిమోనియాను నియంత్రించేందుకు సైతం నిలోఫర్‌ దవాఖానలో ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. శిశుమరణాలను అరికట్టే క్రమంలో నిలోఫర్‌ దవాఖానలో నిమోనియా బాధిత శిశువులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వివరించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...