పిట్ట కొంచెం.. రికార్డులు ఘనం


Wed,November 20, 2019 12:56 AM

-ఏడేండ్లకే.. రెండు ప్రపంచ రికార్డులు
-20 నిమిషాల్లో అత్యధిక సిరామిక్ టైల్స్‌ను పగుల గొట్టే ఆత్మవిశ్వాసం
-పేపర్‌తో వివిధ బొమ్మల తయారీ, కరాటే, చిత్రలేఖనంలోనూ ప్రతిభ
బషీర్‌బాగ్, నవంబర్ 19 : నిత్యం నిద్ర లేచింది మొదలు, చదువు, ర్యాంకులు అంటూ పిల్లలను అనేక ఒత్తిళ్లకు గురిచేస్తున్న తల్లి తండ్రులకు సహృద ఒక ఆదర్శం అని చెప్పక తప్పదు. మారేడ్‌పల్లిలోని గీతాంజలీ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న సహృద కేవలం పేపర్‌తో వివిధ రకాల బొమ్మలు ఎటువంటి గేమ్ కానీ, ఇతర వస్తువులు కానీ ఉపయోగించకుండా తయారు చేయడంలో తనకంటూ ప్రత్యేకతను సాధించింది. ప్రపంచ రికార్డు అనగానే ఎంతో కష్టపడాలి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి, అది కేవలం డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే సాధ్యం అనుకోవడం పొరపాటు అని రుజువు చేసింది చిన్నారి సహృద. ఏడు సంవత్సరాల వయస్సులోనే వివిధ రంగాల్లో తనదంటూ ప్రత్యేకతను సాధించుకుంటూ సరదాగా తల్లి దగ్గర నుంచి నేర్చుకున్న ఆటతో రెండు ప్రపంచ రికార్డులు సాధించి అందరి మన్ననలు పొందుతున్నది.

కరాటే, చిత్రలేఖనంలోనూ రికార్డులు..
సహృద ఇటీవల ఒకే గంటలో అత్యధిక బొమ్మలు తయారు చేసి రెండు రికార్డులు సృష్టించింది. కరాటేలో గ్రీన్ బెల్ట్ స్టేజీలో ఉన్న సహృద 20 నిమిషాల్లో అత్యధిక సిరామిక్స్ టైల్స్‌ను చేతితో అవలీలగా పగులగొట్టి మరొక రికార్డు నెలకొల్పింది. ఏకదాటిగా ఐదు గంటల పాటు చిత్రలేఖనం ద్వారా రంగులు దిద్దడంలోనూ రికార్డు సాధించింది. ఎలైట్ వరల్డ్ రికార్డులు రెండు, ఇండియన్ రికార్డ్స్ రెండు, ఏషియన్ రికార్డులు రెండు సాధించిన సహృద ఒకే రోజు మూడు రికార్డులు సాధించడం విశేషం. నేటి పిల్లలకు కేవలం చదువుకోవడానికే సమయం చాలక అవస్థలు పడుతున్న ఈ కాలంలో భరతనాట్యం, కూచిపూడి వంటి కళలతో పాటు అథ్లెటిక్స్, కరాటే, పెయింటింగ్ వంటి అనేక రంగాల్లో రాణిస్తున్నది. అంతేకాకుండా చదువులో కూడా ముందువరుసలో ఉండడం గమనార్హం. టెన్నిస్‌పై మక్కువ ఉన్న సహృద భవిష్యత్‌లో టెన్నిస్ క్రీడాకారిణి కావాలని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నది. అతి చిన్న వయసులోనే ఇన్ని రంగాల్లో ప్రావీణ్యతను సాధించుకున్న చిన్నారి భవిష్యత్‌లో మరిన్ని రికార్డులు సాధించి టెన్నిస్ క్రీడాకారిణి కావాలని ఆశిద్దాం.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...