నాగ్‌పూర్‌లో జీహెచ్‌ఎంసీ బృందం పర్యటన


Wed,November 20, 2019 12:53 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : డబుల్ డెక్కర్ ప్రాజెక్టులతో భూసేకరణ, ప్రాజెక్టు వ్యయం తగ్గిందని నాగ్‌పూర్ పర్యటన సందర్భంగా అక్కడి అధికారులు జీహెచ్‌ఎంసీ బృందానికి తెలిపారు. నాగ్‌పూర్‌లో అమలవుతున్న వినూత్న ప్రాజెక్టులైన సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్వహణ, మెట్రోరైలు ప్రాజెక్టులో చేపట్టిన డబుల్ డెక్కర్ ైఫ్లెఓవర్లు, అండర్‌పాస్‌లు, పార్కుల నిర్వహణ తదితర అభివృద్ధి పనులు నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ నేతృత్వంలో జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజినీర్లు శ్రీధర్, జియాఉద్దీన్, పట్టాణాభివృద్ధిశాఖ మంత్రి ఓఎస్‌డీ మహేందర్‌తోపాటు ఇతర అధికారులు మంగళవారం నాగ్‌పూర్‌లో పర్యటించి పరిశీలించారు. నాగ్‌పూర్‌లో రూ.8680 కోట్ల వ్యయంతో చేపట్టిన నాగ్‌పూర్ మెట్రోరైలు ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అక్కడి అధికారులతో జీహెచ్‌ఎంసీ బృందం సమావేశమైంది.
38.215 కిలోమీటర్ల విస్తీర్ణంలో చేపట్టిన మెట్రోరైలుకు డబుల్ డెక్కర్ ైఫ్లెఓవర్లను వినూత్నంగా నిర్మించారు. రెండు ైఫ్లెఓవర్లను ఒకదానిపై మరొకటి నిర్మించినా వీటిలో ఒక ైఫ్లెఓవర్ ద్వారా వాహనాల రవాణా, మరో దానిపై మెట్రోరైలు రాకపోకలు సాగించేలా నిర్మించారు. దీనివల్ల భూసేకరణ, ఆస్తుల సేకరణ తక్కువగా ఉండటం, ప్రాజెక్టు వ్యయంలో దాదాపు 40శాతం తగ్గడంతోపాటు మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం అత్యంత వేగంగా చేపట్టడానికి అవకాశం కలిగిందని నాగ్‌పూర్ మెట్రో అధికారులు వివరించారు. మెట్రో ప్రాజెక్టు అమలు, నిర్మాణం, నిర్వహణ, ప్రత్యేకతలపై జీహెచ్‌ఎంసీ అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా షటిల్ బస్ సర్వీసులు, బ్యాటరీ ద్వారా నడిచే వాహనాలు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, సైకిళ్ల ఏర్పాటు తదితర సౌకర్యాలను కూడా ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. నాగ్‌పూర్‌లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించిన సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా వచ్చే నీటి ని పార్కులకు, భవన నిర్మాణాలకు ఉపయోగించే విధం గా త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్న నేపథ్యంలో పీపీపీ రంగంలో హైదరాబాద్ నగరంలో ఎస్‌టీపీలను ఏర్పాటు చేసే అంశాలను పరిశీలిస్తున్నట్లు మేయర్ తెలిపారు. నాగ్‌పూర్‌లో నిర్మించిన అండర్‌పాస్‌లు, వీటిలో వర్షపు నీరు చేరకుండా చేపట్టిన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించారు. అదేవిధంగా నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో చేపట్టిన వర్టికల్ గార్డెన్‌లను కూడా బృందం పరిశీలించింది. హైదరాబాద్ నగరాన్ని పర్యటించాలని నాగ్‌పూర్ మెట్రో అధికారులను మేయర్ ఆహ్వానించారు. మేయర్ రామ్మోహన్ నేతృత్వంలో బుధవారం పుణే నగరాన్ని సందర్శించనున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles