పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లు..పత్తాలేకుండా పోయారు


Sat,November 16, 2019 02:52 AM

-జిల్లాలో విధులకు ఎగనామం పెట్టిన టీచర్లు.. జాబితా రూపొందించిన అధికారులు
-పన్నెండున్నర ఏండ్లు పోయిన టీచర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
-నోటీసులు జారీ.. మరో ఐదుగురిపై వేటుకు రంగం సిద్ధం
బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉంటూ.. విధినిర్వహణకు మోహం చాటేశారు. పాఠాలు చెప్పాల్సిన వారు పత్తాలేకుండా పోయారు. సెలవుపెట్టకుండా.. సమాచారం ఇవ్వకుండా.. ఏండ్లుగా విధులకు డుమ్మాకొట్టారు. ఇలా ఒక్క రోజో.. రెండు రోజులు కాదు.. ఏకంగా సంవత్సరాల తరబడి డుమ్మా కొడుతున్నారు. ఇలాంటి వారు జిల్లాలో తొమ్మిది మంది ఉన్నట్లుగా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వీరందరికి నోటీసులు జారీచేశారు. ఇటీవలే నోటీసులందుకున్న ఓ ఉపాధ్యాయురాలు క్షమించడండి తప్పయింది.. ఇక నుంచి సవ్యంగా నడుచుకుంటానని చెప్పి విధుల్లో చేరింది. ఇలా విధుల్లో చేరిన మరుసటి రోజు నుంచి పత్తాలేకుండా పోవడం గమనార్హం. సదరు ఉపాధ్యాయురాలి చర్యలతో విస్తుపోయిన అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఇంత కాలంగా చర్యలేవి
వాస్తవానికి విద్యాశాఖ అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా టీచర్లు ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదు. పాస్‌పోర్టు జారీకావాలన్నా.. విద్యాశాఖ ఎన్‌వోసీ ఇస్తేనే సాధ్యం. ఇక విదేశాలకు వెళ్లాలన్నా విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. సెలవు పెట్టకుండా.. సమాచారం ఇవ్వకుండా మూడు నెలలు దాటితే క్రిమినల్ కేసు పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో వెళితే, డాక్టర్ సర్టిఫికేట్ సమర్పించడంతో పాటు పాస్‌పోర్టును కుడా సమర్పించాల్సి ఉంటుంది. మరి ఇంత కాలం విద్యాశాఖ అధికారులు ఏం చేశారు.. విద్యాశాఖ పర్యవేక్షణ ఎంత లోపభూయిష్టంగా ఉందో ఈ వ్యవహరమే తార్కాణంగా నిలుస్తున్నది. ఇక విషయమేమంటే పత్తాలేకుండా పోయిన వారు ఒక వేళ తిరిగివచ్చినా సంవత్సరం లోపు వస్తే జిల్లా అధికారులు, సంవత్సరం దాటితే విద్యాశాఖ డైరెక్టరేట్ అనుమతితో విధుల్లో చేర్చుకోవాలి. కానీ సంవత్సరం దాటినా జీవోల్లోని లోసుగులను ఆధారం చేసుకుని కొంత మంది చేర్చుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. ఇక విధులకు ఎగనామం పెట్టి ఏం చేస్తున్నారని ఆరా తీస్తే చాలా మంది విదేశాలకు వెలుతున్నట్లుగా తేలింది. చాలా మంది దుబాయ్, అమెరికా, సింగపూర్, గల్ఫ్, అరబ్ దేశాలకు వెళుతున్నారు. అక్కడ టీచర్ల కొరత వేధిస్తుండటం, పైగా నెలకు లక్షలకు లక్షలు సంపాధించే అవకాశం ఉండటంతో చెక్కెస్తున్నారట. కాదు కూడదనుకుంటే హోమ్ ట్యూషన్ చెప్పినా లక్షలు గడించొచ్చన ఆశతో వెళుతున్నారట. మన విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం.. పత్తాలేకుండా పోయినా పట్టించుకునే వారు లేకపోవడం. తిరిగి వచ్చిన తర్వాత ఎదో చెప్పి ఉద్యోగం కొట్టేయవచ్చన్న ఆశతో ధైర్యం చేస్తున్నారట. మొత్తంగా విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న క్రమశిక్షణ చర్యలతోనైనా గాడినపడి.. దారికొస్తారని విద్యాశాఖ అధికారులు అంచనావేస్తున్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles