మందుబాబులకు సైబర్ చీటర్ల వల


Sat,November 16, 2019 02:49 AM

-డోర్ డెలివరీ మద్యం కోసం యువకుల ప్రయత్నం
-20 నిమిషాల్లో మద్యం సరఫరా చేస్తామంటూ హామీ
-డబ్బులు డిపాజిట్ కాగానే.. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్న చీటర్లు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మందుబాబులను సైబర్ చీటర్లు లక్ష్యంగా చేసుకొని నయా పంథాలో మోసాలు చేస్తున్నారు. సామాన్యుడి అంచనాలకు అందకుండా గూగుల్‌ను వేదికగా చేసుకుంటూ రోజుకోరకమైన కొత్త తరహా మోసానికి తెరలేపుతున్నారు. ఆన్‌లైన్‌లో దొరకని వస్తువంటూ లేదు..అన్ని రకాలైన వస్తువులు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. భోజన ప్రియులకు ఇష్టమైన ఫుడ్ స్నాక్స్ 24/7 అందించే ఆన్‌లైన్ సేవలు కొనసాగుతున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మద్యం కూడా ఆన్‌లైన్‌లో సరఫరా చేస్తామంటూ ఆన్‌లైన్‌లో అసలైన దుకాణాల ఫొటోలు పెట్టి తమ సొంత ఫోన్ నంబర్లు అందులో పొందుపరస్తున్నారు. ఇప్పుడు గూగుల్‌లో అందుబాటులో ఉంటున్న ఫోన్ నంబర్లలో చాలా వరకు నకిలీ నంబర్లే ఉంటున్నాయి. మోసం చేసే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు ఈ నంబర్లను అందులో పొందుపరుస్తున్నారు. ఈ నంబర్లను చూసి ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్ ఇచ్చి మోసపోయిన బాధితులు..మరుసటి రోజు దుకాణం వద్దకు వెళ్లి యజమానులను నిలదీస్తున్నారు. ఆన్‌లైన్ మద్యం సేవలు తమ వద్ద లేవని..అసలు మద్యం తాము డోర్ డెలివరీ చేయడం లేదని.. మా పేరుతో మిమ్మల్ని ఎవరో మోసం చేశారంటూ తేల్చి చెబుతున్నారు. దీంతో బాధితులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా సంకోచిస్తున్నారు. అయితే తమ దుకాణాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారంటూ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఆయా దుకాణాల యజమానులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా హైదరాబాద్‌లో మూడు దుకాణాలకు సంబంధించిన యజమానులు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు.

అంతా ఫోన్ నంబర్‌తోనే..!
గూగుల్‌లో ఫోన్ నంబర్‌తోనే ఈ మాయ నడుస్తున్నది. మద్యం దుకాణాలు రాత్రి 10.30గంటల వరకు మూతపడుతాయి. అప్పటి వరకు మద్యం తాగుతుండే వారు.. మద్యం కావాలనుకుంటే దుకాణాలు మూసేస్తారు. దీంతో ఆన్‌లైన్‌లో దొరుకుతుందనే ఆశతో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాలనే సైబర్‌నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో సైబర్‌నేరగాళ్లే ఆయా మద్యం దుకాణాల ఫొటోలు పెట్టి, తమ ఫోన్ నంబర్లను అందులో పొందుపర్చుకుంటున్నారు. ఈ ఫోన్ నంబర్లన్నీ హిమాచల్‌ప్రదేశ్, బీహార్, యూపీ, ఢిల్లీకి సంబంధించినవే ఉంటున్నాయి. మద్యం ఆన్‌లైన్
అమ్మకాలు లేవు.. అయినా అత్యాశకు పోయి మందు బాబులు డబ్బు పోగొట్టుకోవద్దని సైబర్‌క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles