90 రోజుల పాటు అక్రమ నల్లాల క్రమబద్ధీకరణ


Fri,November 15, 2019 04:30 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జలమండలి అనుమతి లేకుండా ఉన్న అక్రమ నల్లాలను క్రమబద్ధీకరించుకునే వీలును కల్పించారు. ఈ మేరకు అక్రమంగా పొందిన నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరించడానికి వీడీఎస్ (వాలంటరీ డిస్‌క్లోజ్ స్కీం) 2019 పథకాన్ని ఆమలు చేయనున్నట్లు ఎండీ దానకిశోర్ గురువారం ప్రకటించారు. ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో ఎండీ దానకిశోర్ మాట్లాడారు. అక్రమంగా ఉన్న నల్లాలను క్రమబద్ధీకరించడానికి వీడీఎస్ పథకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఈనెల 22వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ వరకు 90 రోజుల పాటు ఈ పథకం అమలులో ఉంటుందని ఎండీ వివరించారు. అక్రమ నల్లా కనెక్షన్లు ఉన్న భవన యజమానులు ఆన్‌లైన్‌లో జలమండలి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు.

క్రమబద్ధీకరించుకోకుంటే భారీ జరిమానాలు
క్రమబద్ధీకరించుకోకుండా ఉండి ఆపై అక్రమ కనెక్షన్ అని తేలితే రెండు రెట్లు కనెక్షన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఎండీ హెచ్చరించారు. అంతేకాకుండా మూడు సంవత్సరాల వినియోగ చార్జీలతో పాటు రూ. 300లు సర్వీస్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అక్రమ కనెక్షన్లు కలిగి ఉన్న వినియోగదారులందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నగరవాసులకు ఎండీ సూచించారు.

100 శాతం బిల్లింగ్, వసూళ్లు లక్ష్యంగా పని చేయండి
ప్రతినెల 5వ తేదీ లోపు వాణిజ్య కనెక్షన్లకు, 10వ తేదీ లోపు అన్ని కేటగిరిలకు బిల్లులు జారీ అయ్యేలా ఏజెన్సీలను సమన్వయ పర్చాలని ఎండీ సూచించారు. 100శాతం బిల్లింగ్, కలెక్షన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎండీ అధికారులను ఆదేశించారు. లెక్కలోకి రాకుండా వృథాగా పోతున్న నీటిని అరికట్టి వేరే చోట సరఫరా అదనంగా జలమండలికి ఆదాయం సమకూరుతుందని అభిప్రాయపడ్డారు.అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించి ప్రతి నెల బిల్లింగ్ పరిధిలోకి తీసుకువస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. వీటితో పాటు రిజర్వాయర్ల లీకేజీలు, పైపులైన్ లీకేజీలు, డూప్లికేట్ పైపులైన్ ద్వారా తాగునీరు సరఫరాను నిలిపివేసినా నీటి వృథా తగ్గుతుందన్నారు. రిజర్వాయర్ల లీకేజీలు, ఇన్‌లెట్, ఔట్‌లెట్ పైపులైన్ లీకేజీలను గుర్తించి వాటి మరమ్మతులకు అంచనాలను రూపొందించి 5 రోజుల్లో సమర్పించాలని జీఎంలను ఎండీ ఆదేశించారు.

కొనసాగుతున్న ఇంటింటి సర్వే
ఇంటింటీ సర్వేలో భాగంగా 36, 547 కనెక్షన్లను సర్వే చేయగా అందులో కొత్తగా 1401 సివరేజీ కనెక్షన్లు, 633 కమర్షియల్ కనెక్షన్లు, 880 ఎంఎస్ బీ కనెక్షన్లు, 721 అక్రమ నల్లా కనెక్షన్లు, 66 రికార్డులో నమోదు చేయని భవనం, ప్లాట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ వివరాల ప్రకారం ఒకేసారి కనెక్షన్లు చార్జీల రూపంలో దాదాపుగా రూ. 6.24కోట్లు, నెలనెలా నల్లా బిల్లు ద్వారా దాదాపు రూ. 16 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. ఈ సర్వే నిరంతరంగా నగరం నలువైపులా కొనసాగుతుందని, ఇప్పటి వరకు గుర్తించిన అక్రమ కనెక్షన్లకు నోటీసులు జారీ చేసి వారం తర్వాత అక్రమ నల్లా కనెక్షన్ క్రమబద్ధీకరణ చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సత్యనారాయణ, డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి. రవిలతో పాటు పలువురు సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles