సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఈ -వేలం ప్రక్రియ వివరాలు హెచ్ఎండీఏ వెబ్సైట్ WWW.HMDA.GOV.INలో పొందుపర్చినట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో ఉప్పల్ భగాయత్ ఫేజ్ 1, ఫేజ్-2 లే అవుట్లలో 130 ప్లాట్లను ఈ వేలం వేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. వచ్చే నెల 11వ తేదీ వరకు ఈ -వేలానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనున్నామని తెలిపారు.
డిసెంబరు 14, 15, 16వ తేదీలలో మూడు రోజుల పాటు ఈ యాక్షన్ నిర్వహించనున్నామని తెలిపారు. 2515/1 నుండి 2515/132 వరకు ఆసక్తి గల వారందరూ మరిన్ని వివరాల కోసం WWW.AUCTIONS. HMDA. GOV.INలోసంప్రదించవచ్చన్నారు. కాగా అంతకు ముందు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ అన్ని విభాగాల ఉన్నతాధికారులతో తార్నాక సంస్థ ప్రధాన కార్యాలయంలో పనుల పురోగతి, ప్రతిపాదిత ప్రాజెక్టులపై సమీక్షించారు.
ల్యాండ్ ఫూలింగ్ స్కీం, కోకాపేట భూముల ఈ యాక్షన్, ఉప్పల్ భగాయత్ ఈ వేలం, ప్లానింగ్ విభాగంలో నిర్మాణ రంగ అనుమతులను పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.