ఉచితంగా విద్య,వైద్యం లభిస్తేనే అభివృద్ధికి బాటలు


Fri,November 15, 2019 04:28 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రూపాయి ఖర్చుపెట్టకుండా.. విద్య, వైద్యం ఉచితంగా లభించినప్పుడే మన దేశం అభివృద్ధి చెందినట్లని, పేదరికం నుంచి విముక్తి పొందినట్లని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అత్యంత కీలకమైన వైద్యం, విద్యలను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వాలు విధివిధానాలను రూపొందించుకోవాలని సూచించారు. ఫౌండేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) సంయుక్తాధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని ఆస్కీ భవనంలో మామి డి భోజిరెడ్డి, ఈవీ రాంరెడ్డి స్మారకోపన్యాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్స్‌టన్ యునివర్సిటీ ఉడ్రోవిల్సన్ స్కూల్ ప్రొఫెసర్ జెఫ్రీ హమ్మర్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లాంట్ ప్రిచెట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యి ప్రసంగించారు. వైద్యంపై జెఫ్రీ హమ్మర్ మాట్లాడు తూ.. 70 శాతం రోగాలను ప్రాథమిక స్థాయిలోనే వైద్యం చేస్తే నయం చేసుకోగలమని, కానీ ఇప్పటికీ ప్రాథమికవైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమన్నారు.

ప్రత్యేకించి భారత్‌లో పీహెచ్‌సీల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యిందన్నారు. డాక్టర్లు రోగులతో మనసువిప్పి మాట్లాడటంలేదని... రోజులో గరిష్టంగా 39 నిమిషాలే మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్త్ ఇన్స్యూరెన్స్‌లకు కోట్లు ఖర్చు పెట్టడం కన్నా.. పీహెచ్‌సీలు సహా వైద్యసదుపాయాలను మెరుగుపరచడానికి ప్రయత్నించాలన్నారు. సకాలంలో వ్యాక్సీన్లు వేయించడం, సురక్షితమంచినీరు, శానిటేషన్, పోషకాహారాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఈ దిశగా ప్రభుత్వాలు దృష్టిసారించాలన్నారు. లాంట్ ప్రిచెట్ మాట్లాడు తూ.. విద్య పూర్తిగా వ్యాపారమయ్యిందని, పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు నానా తంటాలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులు అందుబాటులోకి రావాల్సిన అవసరముందన్నారు. ఫౌండేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్ నారాయణ, ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య సహా పలు రంగాలకు చెందిన నిపుణులు, విద్యావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles