కాచిగూడలో ట్రాక్‌ పునరుద్ధరణ, యథావిధిగా రైళ్లు


Wed,November 13, 2019 02:02 AM

- లోకో పైలెట్‌ చంద్రశేఖర్‌ పరిస్థితి విషమం
- రేపు విచారణకు హైలెవల్‌ కమిటీ


కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి మంగళవారం యథావిధిగా రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సుమారు 600మంది సిబ్బంది ఉద యం 6 గంటల వరకు శ్రమించి పునరుద్ధరణ పనులు చేపట్టారు. అలాగే లోకో పైలెట్‌ చంద్రశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటనపై దక్షిణమధ్య రైల్వే అత్యున్నతస్థాయి విచారణ జరుపనున్నది.

అంబర్‌పేట/కాచిగూడ, (నమస్తే తెలంగాణ):కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి మంగళవారం రైళ్ల రాకపోకలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. అయితే సంఘటన జరిగిన తరువాత రైల్వే డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన 13 విభాగాలు పునరుద్ధరణ పనుల్లోకి దిగాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న రైల్వే జీఎం గజానంద్‌ మాల్యా విశాఖపట్టణం నుంచి హుటాహుటిన నగరానికి బయలుదేరి వచ్చారు. ముందుగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆయా దవాఖానలకు వెళ్లి పరామర్శించారు. అర్ధరాత్రి 12 గంటల తరువాత ఘటన జరిగిన కాచిగూడ రైల్వేస్టేషన్‌ ప్రాంతానికి వచ్చారు. ఆయనతో పాటు అడిషనల్‌ జీఎం బి.బి.సింగ్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌(డీఆర్‌ఎం) ఎన్‌.ఎస్‌.ఆర్‌ ప్రసాద్‌, ఏడీఆర్‌ఎం సాయిప్రసాద్‌ల పర్యవేక్షణలో ఇతర అధికారులు , సిబ్బంది 600 మంది మంగళవారం ఉదయం 6 గంటల వర కు పట్టాలపై ఉండి పునరుద్ధరణ పనులు చేపట్టారు. రైళ్ల రాకపోకలకు ట్రాక్‌ అనువుగా ఉందని ఉదయం 7.10కు ట్రాక్‌ ఫిట్‌నెస్‌ ఇచ్చా రు. ఉదయం 8 గంటలలోపు ధ్వంసమైన ఎంఎంటీఎస్‌కు చెందిన ఏడు కోచ్‌(రెండు పూర్తిగా ధ్వంసం, ఐదు పాక్షికంగా ధ్వంసం)లను మౌలాలీలోని డీజిల్‌ షెడ్‌కు తరలించారు.బాగున్న మిగతా కోచ్‌లను కాచిగూడ స్టేషన్‌లో పక్కన పెట్టారు.

అదే విధంగా కర్నూలు ఇంటర్‌సిటీ హంద్రీ ఎక్స్‌ప్రెస్‌లో ధ్వంసమైన ఏడు కోచ్‌లను ఫలక్‌నుమాకు తరలించారు. రైలు పట్టాలపై కోచ్‌లు లేకుండా చేశారు.మొదట ట్రాక్‌ఫిట్‌నెస్‌ ఇచ్చిన తరువాత అధికారులు మిగతా పనులు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో తొలిగించిన ఓహెచ్‌ఈ(ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)కరెంటును పునరుద్ధరించే పనులు ప్రారంభించారు.ట్రాక్‌ సర్క్యూట్‌, ట్రాక్‌ ఇన్‌ష్యులేషన్‌ పనులు చేశారు. మీటర్లతో ట్రాక్‌ను చెక్‌ చేశారు. ఉదయం 10.45 వరకు ఈ పనులు పూర్తి చేశారు.ఎలక్ట్రిసిటీతో కాకుండా డీజిల్‌ ఇంజన్‌తో నడిచే రైళ్ల రాకపోకలకు గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అప్పటికే ఫలక్‌నుమా వద్ద వేచి ఉన్న తిరుపతి-సికింద్రాబాద్‌ సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్‌ ఇవ్వడంతో 11.40 ప్రాంతంలో ఆ రైలు కాచిగూడ రైల్వేస్టేషన్‌ను చేరుకుంది. పనుల పునరుద్ధరణ తరువాత నడిచిన మొదటి రైలు సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌. అనంతరం 12.11కు యశ్వంత్‌పూర్‌-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ కాచిగూడకు వచ్చిం ది. ఇలా బెంగుళూరు, చెంగల్పట్టు అన్ని రైళ్లు ఒక్కొక్కటిగానడవడం ప్రారంభించాయి.

ఒంటిగంటకు ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ
ప్రమాదం జరిగిన తరువాత తొలిగించిన ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌(ఎలక్ట్రిసిటి) పనులను మధ్యాహ్నం ఒంటిగంటకు పునరుద్ధరించారు. అన్ని ట్రాక్‌లను రైళ్లు నడవడానికి వీలుగా సిద్ధం చేశారు. రైల్వే చీఫ్‌ ఇంజినీర్‌(బ్రిడ్జెస్‌) రవీంద్రనాథ్‌రెడ్డి తన బృందంతో వచ్చి పనులను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 3గంటలకు మొదటి ఎంఎంటీఎస్‌ రైలు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు బయలుదేరి కాచిగూడ స్టేషన్‌కు 4.15కు వచ్చింది.

రూ.8 కోట్ల నష్టం
రైళ్లు ఢీకొన్న ప్రమాద నష్టం రూ.8 కోట్లుగా అధికారులు అంచ నా వేశారు. ధ్వంసమైన కోచ్‌ల నష్టం రూ.7 కోట్లు, రైళ్ల రద్దు, రైళ్ల మళ్లింపు, ఓహెచ్‌ఇ తొలగింపు, పునరుద్ధరణ వంటి పనుల కోసం మరో కోటి రూపాయలు కలిసి మొత్తం రూ.8 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పారు.

డేటా లాగర్స్‌ ద్వారా ఘటన వివరాల సేకరణ
రెండు రైళ్లు ఢీకొన్న సంఘటనలో ఎంఎంటీఎస్‌ లోకో పైలెట్‌ ఎల్‌సీహెచ్‌ చంద్రశేఖర్‌ సిగ్నల్‌ ఓవర్‌ షూట్‌ చేయ డం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే పక్కాగా తేల్చడానికి రైల్వే అధికారులు డేటా లాంగర్స్‌(డేటా లాగింగ్‌)ను ఉపయోగించాలని భావిస్తున్నారు.

లోకో పైలెట్‌ పై కేసు నమోదు
ప్రమాదానికి కారణమైన లోకో పైలెట్‌ ఎల్‌సీహెచ్‌ చంద్రశేఖర్‌ పై రైల్వేపోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్‌ సూపరింటెండెంట్‌ జి.దశరథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకునిర్లక్ష్యంగా రైలును నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని, ప్రయాణికులు గాయపడేలా చేశాడని పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 337, 338, 308 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

లోకోపైలెట్‌ డ్యూటీకి ఫిట్టేనా?
అంబర్‌పేట/కాచిగూడ, నవంబర్‌ 12(నమస్తే తెలంగాణ): సిగ్నల్‌ ఓవర్‌ షూట్‌ చేసి రైలు ప్రమాదానికి కారణమైన ఎంఎంటీఎస్‌ లోకో పైలెట్‌ డ్యూటీ చేయడానికి ఫిట్‌గా ఉన్నాడా? లేదా? అనే సందేహంపై రైల్వే సిబ్బంది, అధికారులు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తరువాత అతని భార్య తన భర్త ఫిట్‌నెస్‌పై అధికారుల వద్ద అనుమానం వ్యక్తం చేసిందని చెప్పుకుంటున్నారు. వివరాల్లోకెళితే... ఏలూరుకు చెందిన ఎల్‌సీచ్‌ చంద్రశేఖర్‌ నగరంలోని గోల్నాక నెహ్రూనగర్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. మొదట ఇతను గూడ్స్‌ రైలు నడిపించేదని తెలిసింది. 2006లో జరిగిన ప్రమాదంలో ఇతని రెండు చేతు లు, ఒక కాలుకు స్టీల్‌ రాడ్స్‌ వేశారని సమాచారం. ఇప్పుడు అతని శరీరంలో చేతులు, కాలుకు రాడ్స్‌ ఉన్నాయని అంటున్నారు. అయితే స్టీల్‌ రాడ్స్‌ ఉండగా రైల్వే డాక్టర్లు ఇతనికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారనేది సందేహం. ఇదే విషయాన్ని అతని భార్య కూడా ప్రమాదం జరిగిన తరువాత కొందరు రైల్వే సిబ్బంది, అధికారులతో అన్నట్లు సమాచారం. గూడ్స్‌ రైలు నడిపించే చంద్రశేఖర్‌కు ఏడాది క్రితం పదోన్నతిపై ఎంఎంటీఎస్‌ లోకో పైలెట్‌ అయ్యారని తెలిసింది. ఇప్పుడు అతని ఫిట్‌నెస్‌పై జోరుగా చర్చ జరుగుతుంది.

విషమంగా లోకో పైలెట్‌ ఆరోగ్య పరిస్థితి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఎంఎంటీఎస్‌ లోకో పైలెట్‌ ఎల్‌.చంద్రశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగినప్పుడు రైలులో ఇరుక్కుపోవడం వల్ల గాయాలయ్యాయని తెలిపారు. ఇప్పటికీ షాక్‌లో ఉన్నారని నాంపల్లి కేర్‌ ఆస్పత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ సుష్మ వెల్లడించారు. కిడ్నీలు చెడిపోయాయని, కాళ్లకు రక్తప్రసరణ జరుగడం లేదని, వాస్క్యూలర్‌ ట్రీట్‌మెంట్‌ జరుగుతున్నదని వెల్లడించారు. మూత్రం బయటకు రావడం లేదని అన్నారు. పక్కటెముటలు విరిగాయని, ప్రస్తుతం ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్‌ నడుస్తున్నదని తెలిపారు.ప్రస్తుతం సర్జరీ చేసే పరిస్థితి లేదని, వెంటిలేటర్‌పై ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంటే ఆపరేషన్‌ గురించి ఆలోచిస్తామని వైద్యులు చెప్పారు. ఎల్‌, చంద్రశేఖర్‌ లోకో పైలట్‌గా ఆగస్టు 17,2011లో దక్షిణమధ్య రైల్వేలో మెకానికల్‌(పవర్‌) డిపార్ట్‌మెంట్‌లో జాయిన్‌ అయ్యా డు. ఐటీఐతో ఉద్యోగం సంపాదించాడు.పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన చంద్రశేఖర్‌కు భార్య సాల్లీడెక్కపాటితో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
రైల్వే ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి విషమం
కాచిగూడ రైల్వేస్టేషన్‌లో రైళ్లు ఢీకొన్న సంఘటనలో తీవ్రగాయాలతో కేర్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రయాణికుల్లో ఒకరైన ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ రషీద్‌ కుమారుడు షేక్‌ సాజిద్‌(43) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కాచిగూడ రైల్వే ఎస్సై పి.సంగమేశ్వర్‌, రైల్వే ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌రావు తెలిపారు.

నేడు కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ విచారణ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కాచిగూడ రైల్వే ప్రమాద ఘటనపై దక్షిణమధ్య రైల్వే అత్యున్నత స్థాయి విచారణ జరుపుతున్నది. నిజానిజాలు తెలుసుకోవడానికి రైల్వేసేఫ్టీ కమిషనర్‌ రాంక్రిపాల్‌ స్వయంగా హాజరుకానున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటనకు సంబంధించి వివరాలను సేకరించనున్నారు. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను, ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొన్న ఘటన నేపథ్యంలో రైల్వేశాఖ దీనికి కారణాలను విశ్లేశించే పనిలో పడింది. సిగ్నలింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ రంగంలో అత్యంత అనుభవమున్న రాంక్రిపాల్‌ స్వయంగా రంగంలోకి దిగడంతో తప్పు ఎక్కడ జరిగిందనే విషయం సునాయసంగా తెలుస్తుందని రైల్వే అధికారులు అంచనాకు వచ్చారు. పైలట్‌ తప్పిదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినప్పటికీ సిగ్నలింగ్‌ లోపాలపై ప్రత్యేక దృష్టిసారించనున్నారు. బుధవారం ఉద యం 10.30 గంటలకు విచారణ ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు.రాంక్రిపాల్‌తో పాటు ఉన్నతస్థాయి బృందంలోని సభ్యులు ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను అన్ని కోణాల్లో సేకరించనున్నారు.

తగ్గిన ప్రయాణికుల సంఖ్య
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగర ప్రయాణికులను చేరవేసే ఎంఎంటీఎస్‌ రైళ్లన్నీ పునరుద్ధ్దరించబడ్డాయి. కాచిగూడ ఘటన నేపథ్యంలో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే మంగళవారం సాయంత్రం నాటికి అన్ని రైళ్లను నడిపించారు. ప్రతి రోజు ఎంఎంటీఎస్‌ ద్వారా 1.7 లక్షల మంది ప్రయాణికులను చేరవేసే ఎంఎంటీఎస్‌ రైళ్లలో మంగళవారం కేవలం 75 వేల మంది మాత్రమే ప్రయాణించారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...