అంపశయ్యపై చిన్నారి


Wed,November 13, 2019 01:58 AM

మేడ్చల్‌ రూరల్‌: అందరి చిన్నారులతోపాటు ఆడిపడే వయస్సులో ఓ చిన్నారికి పెద్ద కష్టం వచ్చింది. తొమ్మిదేండ్ల వరకు అందరిలాగే పాఠశాలకు వెళ్లడం, ఆటలు ఆడటం, మిగితా విషయాల్లో చురుగ్గా ఉండే బాలుడిని మాయరోగం కమ్మేసింది. అకస్మాత్తుగా చిన్న అనారోగ్యంతో మొదలై అంపశయ్య వరకు తీసుకెళ్లింది. ప్రస్తుతం క్షణక్షణం ఆయువును లెక్కించాల్సిన స్థితికి చేరుకున్నాడు. గుండ్లపోచంపల్లిలో నివాసముండే సం తోష్‌, రాధ దంపతుల కుమారుడు నిఖిల్‌ ఈ దయనీయ పరిస్థితిని అనుభవిస్తున్నాడు. ఏడాదిపాటు వైద్యం అందించిన డాక్టర్లు గుండె మార్పిడి జరిగితేనే ఆరోగ్యం మెరుగుపడే అవకాశం లేదని తేల్చారు. ఇందుకు భారీ వ్యయం అవసరంకావడంతో తల్లిదండ్రులు ఎటుపాలుపోని స్థితిలో కన్నీ టి పర్యంతం అవుతున్నారు.

దగ్గు, దమ్ముతో మొదలై...
కొంపల్లిలోని ప్రైవేట్‌ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న నిఖిల్‌ అకస్మాత్తుగా ఒక రోజు దగ్గు, దమ్ముతో బాధపడుతూ అనారోగ్యం పాలయ్యాడు. స్థానికంగా ఉన్న దవాఖానలో తల్లిదండ్రులు చికిత్స చేసి, పాఠశాలకు పంపించారు. నిఖిల్‌ నెల రోజుల తర్వాత ఒక రోజు రాత్రి దగ్గు, దమ్ము అధికమై శ్వాస పీల్చుకోలేని పరిస్థితి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు నగరంలోని దవాఖాన తరలించారు. అక్కడ అన్ని పరీక్షలు చేసిన తర్వాత గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. నిఖిల్‌ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కొడుకు ఆరోగ్యం కోసం కార్పొరేట్‌ దవాఖానలో చికిత్స అందించారు. 8 నెలలుగా చికిత్స పొందుతున్నా బాలుడి ఆరోగ్యంలో మార్పురాలేదు. ఇటీవల పరిస్థితి మరింత దిగజారింది.

వైద్యం కోసం భారీగా వ్యయం
వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌తో గుండెకు వచ్చిన వాపు తగ్గడం లేదని, గుండె మార్పిడి చేస్తే గానీ ఆరోగ్యం బాగుపడే అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పారని నిఖిల్‌ తల్లిదండ్రులు చెప్పారు. వీలైనంత త్వరలో గుండె మార్పిడి జరగాలన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలో రూ.5 లక్షల వరకు వైద్యం కోసం ఖర్చు చేశామన్నారు. గుండె మార్పిడి కోసం రూ. 22 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారని, ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకునే తాను అంతపెద్ద మొత్తం భరించలేక, కొడుకు ఆరోగ్యం చూసి తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని నిఖిల్‌ తండ్రి సంతోష్‌ తెలిపారు. ఇప్పటికే వైద్యు లు ఇచ్చిన మూడు నెలల సమయం ముగిసిపోయిందన్నారు. మరో మూడు నెలల్లో గుండె మార్పిడి జరగకపోతే మిగితా అవయవాలు కూడా పాడై పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని తెలిపారు. తన కొడుకును బతికించుకునేందుకు మనస్సున్న దాతలు సహాయం చేయాలని ఆయన వేడుకుంటున్నాడు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...