‘ మే’ కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తాం..


Wed,November 13, 2019 01:57 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా రూ. 387కోట్ల అంచనా వ్యయం తో హెచ్‌ఎండీఏ నిర్వహించ తలపెట్టిన బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నర్సాపూర్‌ క్రాస్‌రోడ్‌, ఫత్తేనగర్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ రద్ధీకి శాశ్వత పరిష్కారంగా బాలానగర్‌ విమలా థియేటర్‌ నుంచి నర్సాపూర్‌ జంక్షన్‌ మీదు గా ఆరులైన్లతో 1.09 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులను హెచ్‌ఎండీఏ, భూసేకరణ జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్నది. నిర్మాణ పనుల్లో భాగంగా 26 ఫిల్లర్లకు గాను 18 చోట్ల పూర్తి చేశారు. భూ సేకరణలో జాప్యం కారణంగా ఫత్తేనగర్‌ సిగ్నల్‌ నుంచి శోభనా థియేటర్‌ వరకు గల 8 ఫిల్లర్ల నిర్మాణ పనులు జరపాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఫిల్లర్ల నిర్మాణం పూర్తయితే ప్రీ కాస్ట్‌ పద్ధతిలో శ్లాబులను ఆమర్చనున్నారు. ఫిల్లర్ల నిర్మాణ పనులే కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుందని, వచ్చే మే నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేసి ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు.

భూ సేకరణలో తొలగిన అడ్డంకులు : ప్రాజెక్టులో భాగంగా 354 ఆస్తులను గుర్తించిన జీహెచ్‌ఎంసీ 82 చోట్ల ప్రభుత్వ ఆస్తులు, 46 ప్రైవేట్‌ ఆస్తుల స్వాధీనంపై ప్రత్యేక దృష్టి సారించారు. మూసాపేట జంక్షన్‌, నర్సాపూర్‌ క్రాస్‌రోడ్‌ వైపు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. రహదారికి ఎడమ వైపు (ఐడీపీఎల్‌ ) 203 ఆస్తుల సేకరణలో 160 భవన నిర్మాణాలను కూల్చివేశారు. పెండింగ్‌లో 43 ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. కుడి వైపు (ఫత్తే నగర్‌ సిగ్నల్‌/శోభనా థియేటర్‌)న 151 చోట్ల ఆస్తులను సేకరించాల్సి ఉండగా 61 ప్రాపర్టీలను స్వాధీనం చేసుకున్నారు. 90 చోట్ల కూల్చివేతలు జరపాల్సి ఉంది. 354 ప్రాపర్టీలలో 221 చోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇటీవల పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ ప్రక్రియపై ఇటీవల మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సమీక్ష జరిపారు. ఈ క్రమంలోనే ఆస్తుల సేకరణ ముమ్మరం కావడంతో నిర్మాణ పనులకు అడ్డంకులు తొలగిపోయినట్లేనని అధికారులు చెబుతున్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...