భగాయత్ ప్లాట్లకు..మరోసారి వేలం


Tue,November 12, 2019 02:07 AM

-15న నోటిఫికేషన్ జారీ చేయనున్న హెచ్‌ఎండీఏ
-నిర్ణీత ధర గజానికి రూ. 30 వేలుగా ఖరారు చేసే అవకాశం
-రూ. 950 కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మరోసారి ప్లాట్ల ఈ-వేలానికి రెడీ అవుతున్నది. ఇప్పటికే రెండు విడతల్లో ఈ యాక్షన్ చేపట్టి కొనుగోలుదారుల నుంచి అపూర్వ ఆదరణను రాబట్టుకున్నది. సంస్థ వివిధ ప్రాంతాలలో చేపట్టిన వెంచర్లలో మిగిలిన ప్లాట్లను తొలివిడతగా వేలం వేయగా రూ.375కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకున్నది. సెకండ్ ఫేజ్‌లో ఉప్పల్ భగాయత్‌లో 67 ప్లాట్లను వేలం వేయగా 65 ప్లాట్ల ద్వారా రూ.677 కోట్లు ఆదాయాన్ని రాబట్టుకున్నది. ఇందులో రూ.500కోట్లు ఖజానాలోకి వచ్చి చేరగా, మిగిలిన నిధులు కొనుగోలుదారుల విజ్ఞప్తి మేరకు వాయిదా పద్ధతిలో చెల్లింపునకు అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా ఉప్పల్ భగాయత్ ఫేజ్-1లో రైతులకు కేటాయించగా మిగిలిన ప్లాట్లతో పాటు కమర్షియల్ లే అవుట్‌లో 10 ఎకరాల స్థలాన్ని తాజాగా వేలం వేయనున్నారు. 138 ప్లాట్లకు గానూ ( 1,76,330 స్కేర్ యార్ట్స్) స్థలానికి గానూ ఈ-ఆక్షన్ ఉంటుంది. ఎంఎస్‌టీసీ సంస్థ సమన్వయంతో వేలం ప్రక్రియలో 200 గజాల స్థలం నుంచి మూడున్నర ఎకరాల మేర వరకు ప్లాట్లు వేలంలో ఉండనున్నాయి. ఈ మేరకు 15వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే గతంలో గజం రూ.28 వేలు ఉండగా ఈ సారి గజం నిర్ణీత ధర రూ.30వేలుగా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ సారి రూ.950కోట్లపై గురి
రియల్ మార్కెట్‌కు అనుగుణంగా హెచ్‌ఎండీఏ అడుగులు వేస్తూ సంస్థ ఖజానాను ఆర్థికంగా బలోపేతం చేసుకుంటున్నది. హెచ్‌ఎండీఏ స్థలాలపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి అనుగుణంగా మరోసారి ఈ వేలానికి సన్నద్ధమైంది. ఉప్పల్‌లో రియల్ డిమాండ్ ఉండడం, గతంలో అత్యధికంగా గజం ధర రూ.73,900 పలికింది. అయితే ఈ సారి కమర్షియల్, ఇండస్ట్రియల్, మల్టీ పర్పస్ ప్లాట్లు ఉండడంతో వీటికి అత్యధికంగా డిమాండ్ వస్తుందని భావిస్తున్నారు. ప్రధానంగా ఉప్పల్ భగాయత్ లే అవుట్ పక్కనే మెట్రోరైల్, వరంగల్ జాతీయ రహదారి దగ్గరగా ఉండడం ఈ స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని, మూడవ విడత ఈ -వేలం ద్వారా రూ.950కోట్ల మేర ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...