ఖైరతాబాద్, నవంబర్ 11 : రెసిడెంట్ వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ నిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు సోమవారం నిమ్స్ డీన్, అసోసియేట్ డీన్లు డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ మీనా, డాక్టర్ పరంజ్యోతిలకు అసోసియేషన్ సభ్యులు డాక్టర్ శివకుమార్, డాక్టర్ శ్రావణ్, డాక్టర్ మనోజాలతో కలిసి వినతి పత్రం అందచేశారు. రెసిడెంట్ వైద్యులకు ైస్టెఫండ్ పెంచడంతో పాటు 2016 నుంచి రావాల్సిన ఏరియర్స్‌ను చెల్లించాలన్నారు. అలాగే ట్యూషన్, హాస్టల్ వసతి ఫీజులను తగ్గించాలని, పుస్తకాలు, రీసెర్చ్, థిసీస్ అలవెన్సులు పెంచాలని, ప్యాటర్నిటీ లీవ్‌లు ఇవ్వాలని కోరారు. రెసిడెంట్ వైద్యులకు తగిన రక్షణ కల్పించాలన్నారు.
దవాఖానలో హాస్టల్లో ఉండే వైద్యులకు అందిస్తున్న వివిధ సెల్ నెట్వర్క్ వైఫైను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. తమ సమస్యలు వివరించేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేయాలని, ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లైబ్రరీ, రీడింగ్ కోసం ప్రత్యేక గదిని కేటాయించాలని, స్పోర్ట్స్, జిమ్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 2005 నుంచి ఇప్పటి వరకు కూడా స్నాతకోత్సవం నిర్వహించలేదని, ఈ ఏడాది నిర్వహణకు చొరవ చూపించాలన్నారు. అలాగే తమ వద్ద నుంచి వసూలు చేస్తున్న అలుమ్ని ఫండ్‌ను రెసిడెంట్ వైద్యుల సంక్షేమానికి వినియోగించాలన్నారు.