సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సమాచార, సాంకేతిక రంగంలో అత్యంత వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందుకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు సంసిద్ధులు కావాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఎస్ఎంయూ జనరల్ మేనేజర్ జీఎస్ రావు పేర్కొన్నారు. ముఖ్యంగా విమానయాన రంగంలో వస్తున్న మార్పులను అనుసరిస్తూ భద్రతే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం బేగంపేట్ ఎయిర్పోర్టులో అంతర్జాతీయ ఎయిర్ ట్రాఫిక్ సేఫ్టీ ఎలక్ట్రానిక్స్ పర్సనల్(ఏటీఎస్ఈపీ) దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి జీఎస్ రావు ముఖ్యఅతిథిగా హాజరై విమానయాన భద్రతలో సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్టీసీ జనరల్ మేనేజర్ సుభాష్కుమార్, ఆర్అండ్ డీ జనరల్ మేనేజర్ మానస్కుమార్ దాస్ తదితరులు పాల్గొన్నారు.