చిక్కడపల్లి : సహజ వనరులు లేనిదే మానవ మనుగడ సాధ్యం కాదని ప్రముఖ పర్యావరణవేత్త పద్మశ్రీ ఎంసీ మెహతా అన్నారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయడం తగదన్నారు. చిక్కడపల్లి పెండేకంటి న్యాయ కళాశాల ైక్లెమెట్ చేంజ్ ఎన్విరాల్మెంట్ లా అండ్ మేనేజ్మెంట్ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనాల సంఖ్య ఏటేటా రెట్టింపవుతుందని, దీని మూలంగా కాలుష్యం పెరుగుతుందన్నారు. ఫోన్లు, కంప్యూటర్ల వాడకం పెరుగటంతో మానవ సంబంధాలు కనుమరుగువుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం తినే మాంసం, చేపలు విష పూరితంగా మారాయన్నారు.
ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుశోత్తంరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనం కోసం సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు దారబోయాలని ప్రయత్నించడం విచారకరం అన్నారు. ఈ సందర్భంగా పర్యావరణానికి సంబంధించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. వాసవి ఎడ్యుకేషనల్ అకాడమీ అధ్యక్షుడు పి.రామ్మోహన్రావు అధ్యక్షత వహించిన ఈ సదస్సులో ఉస్మానియ న్యాయవిభాగం డీన్ ప్రొఫెసర్ పంత్నాయక్, ప్రొ.జయకుమార్, సదస్సు కన్వీనర్ డాక్టర్ ఆరతిత్యాగి, ఎ.వాణి, పి.అరవింద్, డాక్టర్ మోహన్, ఆర్.మోనిక, ఏవీ శ్యాంప్రసాద్, శోభారాణి పాల్గొన్నారు.