11 వేల ఇండ్లు సిద్ధం


Fri,November 8, 2019 12:37 AM

-జనవరి నుంచి ప్రారంభోత్సవాలు -తొలుత ఇన్‌సిటూ కాలనీల్లో పంపిణీ
-రెండు నెలల్లో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌సిటూ పద్ధతిలో నిర్మించిన కాలనీల్లో లబ్ధిదారుల ఎంపిక ఇదివరకే పూర్తయినందున ముందుగా ఈ కాలనీలను లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారు. అనంతరం ఖాళీ జాగాల్లో పూర్తయిన కాలనీలను కూడా దశలవారీగా పంపిణీ చేయాలని నిశ్చయించారు. నగరంలోని పేదల కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఒక లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టగా, సుమారు 11వేల ఇళ్లు పూర్తయ్యాయి. అందులో రాంపల్లి, అహ్మద్‌గూడల్లోని ఖాళీజాగాల్లో నిర్మించినవే దాదాపు పదివేల ఉన్నాయి. ఇవికాకుండా ఇన్‌సిటీ పద్ధతిలో సింఘంచెరువు తండా, గాజులరామారం, అమీన్‌పూర్-1, జమ్మిగడ్డ, ఖిడికీ బూత్ అలీషా, సయద్ సాబ్ కా బాడా తదితర చోట్ల మరో వెయ్యి ఇండ్లు పూర్తయ్యాయి. పూర్తయిన ఇళ్ల కాలనీలకు విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఈ రెండు నెలల్లో ఈ సౌకర్యాలు కల్పించి దశలవారీగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ముందుగా ఇన్‌సిటూ కాలనీల్లోని 1000 ఇళ్లను పంపిణీ చేయాలని నిశ్చయించిన అధికారులు, వాటిల్లో మంచినీరు, విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.10 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కేంద్ర నిబంధనలతో లబ్ధిదారుల ఎంపికలో జాప్యం
పీఎంఏవై నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, లబ్ధిదారుడు కూడా వాటాదారులుగా ఉండాలి. దీనికోసం ముందే లబ్ధిదారులను ఎంపిక చేసి వారి వాటా నిధులను బ్యాంకులో జమచేయా ల్సి వుంటుంది. అంతేకాకుండా, లబ్ధిదారుడి ఆర్థిక స్థితిగతులు, బ్యాంకు ఖాతా నంబరు, ఇంటి యజమానితోపాటు కుటుంబసభ్యుల అందరి ఆధార్ నంబర్లు, ప్రస్తుతం తానుంటున్న ఇల్లుకి సంబంధించి పూర్తి వివరాలు, దేశంలో ఎక్కడా తనకి ఇల్లు లేదని తెలిపే ధ్రువీకరణపత్రం, వార్షిక ఆదాయం, కాంటాక్ట్ నంబరు తదితర అనేక అంశాలను పొందిపర్చి కేంద్రానికి పంపాల్సి ఉం టుంది. అప్పుడే కేంద్రం పరిశీలించి ఇళ్లను మంజూరు చేస్తుంది. అయితే మన రాష్ట్రంలో ఇండ్లకయ్యే ఖర్చంతా లబ్ధిదారుడితో ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. లబ్ధిదారుడి వాటాతోపాటు వారి వివరాలు లేవని పేర్కొంటూ నిధులను విడుదల చేయకుండా కేంద్రం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఇన్‌సిటూ విధానంలో నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి దాదాపు 30వేలమంది లబ్ధిదారుల వివరాలను అధికారు లు సేకరించగా, ప్రభుత్వ స్థలాల్లో నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తిచేయాల్సి వుంది. ముందుగా లబ్ధిదారులను ఎంపికచేసి వారి వాటా మొత్తం ఎంతో తేలితేనే తమ వాటా మొత్తాన్ని విడుదల చేస్తామని కేంద్ర అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరుగుతున్నట్లు వారు తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...