రోబో పనులు షురూ..


Wed,November 6, 2019 01:08 AM

- స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు
- 30 నుంచి 40 మీటర్ల మ్యాన్‌హోల్స్‌లో పూడికతీత
- మాదాపూర్‌లోని న్యాక్‌ రోడ్డులో మొదలైన పనులు
- రోబోటిక్‌ యంత్ర పరికరాన్ని ప్రారంభించిన మేయర్‌ బొంతు రామ్మోహన్‌

మాదాపూర్‌, నవంబర్‌ 5 : హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరం వైపు నడిపే దిశగా కృషి చేస్తున్నామని, నగరంలో మొట్టమొదటి సారిగా మ్యాన్‌హోళ్లలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించే యంత్ర పరికరాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. మంగళవారం రహేజ సంస్థ వారి సౌజన్యంతో సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ద్వారా రూ.32 లక్షల వ్యయంతో కూడిన బాండీకూట్‌ రోబోటిక్‌ యంత్ర పరికరాన్ని మాదాపూర్‌లోని న్యాక్‌ రోడ్డు మార్గంలో స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్‌ వి.జగదీశ్వర్‌గౌడ్‌, జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోన్‌ కమిషనర్‌ దాసరి హరిచందనతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు మ్యాన్‌హోల్‌ పూడికతీతకు ఉపయోగించే మానవరహిత బాండీకూట్‌ రోబోటిక్‌ యంత్రాన్ని జీహెచ్‌ఎంసీ వారు మొట్టమొదటి సారిగా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.

మ్యాన్‌హోళ్లను శుభ్రం చేసే సమయంలో పారిశుధ్య కార్మికులు అనారోగ్యాల బారిన పడడం జరుగుతున్నదని, గతంలో మ్యాన్‌హోళ్లలను శుభ్రం చేసేందుకు వచ్చిన పారిశుధ్య కార్మికులు ప్రమాదవశాత్తు మరణించడం జరిగిందన్నారు. ఈ యంత్రంతో కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డ్రైనేజీని తొలగించవచ్చన్నారు. పారిశుధ్య కార్మికులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా 24 గంటల పాటు ఈ పరికరంతో మ్యాన్‌హోల్స్‌, డ్రైనేజీలను శుభ్రం చేయవచ్చన్నారు. ప్రమాద రహిత యంత్రం ద్వారా 30 నుంచి 40 మీటర్ల లోతు వరకు మ్యాన్‌హోళ్లలోని పూడికతీతకు ఈ యంత్రం చక్కగా ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్‌లోని అన్ని డివిజన్లలో ఈ యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఉపాధిని కల్పించే వీలు ఉంటుందన్నారు. ఇప్పటికే నగరంలో స్వీపింగ్‌ యంత్రాలు, సివరేజ్‌ డ్రైయిన్ల క్లీనింగ్‌కు ఎయిర్‌టెక్‌ మిషన్లు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మానవ రహిత యంత్రాల ద్వారా శానిటేషన్‌ కార్యక్రమాలను చేపట్టేందుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఈ యంత్రాలు 8 రాష్ర్టాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. దీని ధర రూ.40 లక్షల వరకు ఉంటుందని, మున్ముందు మరిన్ని యంత్రాలను ఉపయోగంలోకి తీసుకువచ్చి నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ డైనేజీ శుభ్రం చేసే యంత్రాన్ని మొట్టమొదట శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మ్యాన్‌హోల్‌ పూడికతీతకు ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీని వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. అనంతరం జోనల్‌ కమిషనర్‌ హరిచందన మాట్లాడుతూ వెస్ట్‌జోన్‌ పరిధిలో దాదాపు 7 వేల మ్యాన్‌హోళ్లు నాలుగైదు మీటర్ల లోతులో ఉన్నాయని, ఈ మ్యాన్‌హోళ్ళలో చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు రోబో యంత్రాలను సీఎస్‌ఆర్‌ కింద ప్రవేశపెట్టినట్లు తెలిపారు. డ్రైనేజీని శుభ్రం చేసేటప్పుడు యంత్రానికి ఏర్పాటు చేసిన కెమెరాల సహాయంతో డిస్‌ప్లేలో చూస్తూ ఎక్కడైతే డ్రైనేజీ పేరుకుపోయిందో అక్కడ అటు ఇటు కదుపుతూ క్లీన్‌ చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌ యాదగిరిరావు, ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు ఈఈ చిన్నారెడ్డి, ఆనంద్‌, శిరీష, వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్‌, ఏఈ అనురాగ్‌, మాజీ కార్పొరేటర్‌ రంగారావు, టీఆర్‌ఎస్‌ నాయకులు సంజీవరెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్‌, ఎర్రగుడ్ల శ్రీనివాస్‌ యాదవ్‌, నార్నె శ్రీనివాస్‌, జంగయ్య యాదవ్‌, జయరాజ్‌ యాదవ్‌, లక్ష్మారెడ్డి, వార్డు సభ్యులు రాంచందర్‌, జంగం గౌడ్‌, మధు, సత్యారెడ్డి, బ్రహ్మయ్య, సంపత్‌, సర్వర్‌, రహీం, శ్రావణ్‌, సీత తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...