ప్లాస్టిక్‌ వ్యర్థాలతో.. పేవింగ్‌ బ్లాక్స్‌ తయారీ


Wed,November 6, 2019 01:05 AM

కంటోన్మెంట్‌, నవంబర్‌ 5 (నమస్తే తెలంగాణ): ప్రకృతి వినాశకారిగా తయారైన ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ప్లాస్టిక్‌ను క్రమక్రమంగా తగ్గిస్తూనే.. ప్లాస్టిక్‌ పునర్వినియోగం దిశగా అడుగులు వేస్తున్నది. ప్లాస్టిక్‌తో పెట్రోల్‌ తయారి, రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నది. ఇలాంటి నూతన ఆవిష్కరణలకు బీజం పడుతున్న తరుణంలో మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థిని సౌమ్యప్రియ ప్లాస్టిక్‌తో ‘పేవింగ్‌ బ్లాక్స్‌'ను సృష్టించి పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నది. నగరంలో నిత్యం పోగయ్యే ప్లాస్టిక్‌ వ్యర్థాలతో సులభమైన పద్ధతిలో పేవింగ్‌ బ్లాక్స్‌లనుతయారు చేయవచ్చుని నిరూపించి, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రశంసలను అందుకున్నది.

పట్టుదలతో ముందుకు
మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న గార్లపాటి సౌమ్యప్రియకు చిన్ననాటి నుంచి ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండేది. ఇంజినీరింగ్‌ పూర్తి అయ్యేలోపు ఏదైనా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలనుకున్నది. ఈ క్రమంలోనే వివిధ పుస్తకాలు, ఆన్‌లైన్‌లో ఎంతో పరిశోధన చేసింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్లాస్టిక్‌ పునర్వినియోగంపై ఆవిష్కరణలు చేస్తే సమాజానికి మేలు చేసినదాన్ని అవుతానని నిర్ణయించుకున్నది. దీంతో తొలుత ప్లాస్టిక్‌తో ఇటుకుల తయారీ కోసం ప్రయత్నించి, విఫలమైంది. దీంతో పేవింగ్‌ బ్లాక్స్‌ తయారీపై దృష్టి మరల్చి విజయం సాధించింది.

పేవింగ్‌ బ్లాక్స్‌ తయారీ ఇలా..
పేవింగ్‌ బ్లాక్స్‌ను తయారు చేసే క్రమంలో ప్లాస్టిక్‌ బాటిళ్లు, పాలిథిన్‌ కవర్లతో ప్రయోగాలు చేపట్టిన సౌమ్య సక్సెస్‌ అయ్యింది. గరిష్ఠంగా 150 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ప్లాస్టిక్‌ వ్యర్థాలను ద్రవరూపంలోకి మార్చి, ఆ ద్రవాన్ని అచ్చులోకి మార్చి చల్లబరచాలి. మెల్లమెల్లగా ఆ ద్రవాన్ని బ్లాక్స్‌గా మార్చుకుంటూ పటుత్వాన్ని పెంచాలి. ఇలా తయారైన పేవింగ్‌ బ్లాక్స్‌ను పార్కింగ్‌ ప్రదేశాలు, ఫుట్‌పాత్‌ల కోసం పార్కులలో వాకింగ్‌ ట్రాక్‌ల కోసం వినియోగించే అవకాశం ఉంది. చైనాతోపాటు మరో నాలుగు దేశాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో చేసిన పేవింగ్‌ బ్లాక్స్‌ను వినియోగిస్తున్నారు. ఈ బ్లాక్స్‌ తయారీకోసం నీటిని వినియోగించాల్సిన అవరంలేదు. కాంక్రీట్‌, సిమెంట్‌, ఇసుక వాడకం కూడా తక్కువగానే అవసరమవుతుంది. రానున్న రోజుల్లో పేవింగ్‌ బ్లాక్స్‌ వినియోగం పెరిగే అవకాశం ఉంది.

అడిడాస్‌ ‘షూ సోల్‌' ప్రేరణ
ప్రముఖ షూస్‌ కంపెనీ అడిడాస్‌ షూస్‌ సోల్‌ను ప్లాస్టిక్‌ వ్యర్థాలతోనే తయారు చేస్తారని తెలుసుకున్న సౌమ్య.. ఈ విధానంపై మరింత అధ్యయనం చేసింది. ఒక జత సోల్‌ తయారీకి కనీసంగా 11 ప్లాస్టిక్‌ బాటిళ్లు వినియోగిస్తారని తెలుసుకొని దాని ప్రేరణతో పేవింగ్‌ బ్లాక్స్‌ తయారీని ప్రారంభించింది. అయితే సౌమ్య తయారు చేసిన పేవింగ్‌ బ్లాక్స్‌ తయారీకి క్యూరింగ్‌ అవసరంలేదు. 24 గంటల నుంచి 48 గంటల్లోపు వినియోగించుకోవచ్చు. ఈ బ్లాక్స్‌ నీటిని పీల్చుకోవు. భారీ అగ్నిప్రమాదాలు కాకుండా నిర్ణీత ఉష్ణోగ్రత వరకు మంటలను తట్టుకోగలవు. వేసవిలోనూ సంకోచ, వ్యాకోచాలకు గురికావు. ఇక మార్కెట్‌లో ప్రస్తుతం వినియోగిస్తున్న వివిధ రకాల పార్కింగ్‌ టైల్స్‌తో పోలిస్తే చవకగా లభిస్తూ ఉండడంతో వీటికి భవిష్యత్తులో ఆదరణ లభించే అవకాశం ఉంది.

ప్రభుత్వం ప్రోత్సహిస్తే
ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే సొంత యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఉంది. యూనిట్‌ను స్థాపించే ఆర్థిక స్థోమత లేనందున ప్రభుత్వ సహకారం తీసుకోవాలని భావిస్తున్నా. కలల ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించడంతోపాటు పలువురు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా. అదేవిధంగా ప్లాస్టిక్‌ పునర్వినియోగంలో భాగస్వామి కావాలని ఆకాంక్షిస్తున్నాను.
-సౌమ్యప్రియ, సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థిని.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...