జలమండలిలో ఇంటి దొంగ


Wed,November 6, 2019 01:04 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జలమండలిలో మరో ఇంటి దొంగ అడ్డంగా దొరికాడు.. సంస్థ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్జనే ధ్యేయంగా లైన్‌మన్లు పనిచేస్తున్నారు. ఇటీవల బంజారాహిల్స్‌ నవీన్‌నగర్‌లో పని చేస్తున్న లైన్‌మన్‌ పి. దుర్గయ్య ఒక్కో అపార్ట్‌మెంట్‌ నుంచి అక్రమంగా ప్రతి నెల రూ.2వేలు వసూలు చేస్తూ అడ్డంగా దొరికిన విషయం విదితమే. ఈ క్రమంలోనే తాజాగా విజిలెన్స్‌ విభాగం అధికారులు మరో చోట ఉల్లంఘనుడి గుట్టును రట్టు చేశారు. గచ్చిబౌలి సెక్షన్‌ పరిధిలో దాదాపు ఐదేండ్లుగా ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తున్న శ్రీను అక్రమాలపై ఇంటింటి సర్వేలో ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన విజిలెన్స్‌ విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల నీటి వినియోగాన్ని ఆసరాగా మలుచుకుని అదే పనిగా శ్రీను అనే లైన్‌మన్‌ అడ్డదారిలో నల్లా కనెక్షన్లు ఇచ్చాడు.

గచ్చిబౌలి సెక్షన్‌లో పనిచేస్తున్న శ్రీను ప్రతి రోజూ నీటి సరఫరా పనులు చూడాల్సింది పోయి అక్రమార్జనకు తెర లేపాడు. వాంబే కాలనీ, వాంబే అపార్ట్‌మెంట్‌, పాపిరెడ్డి కాలనీలకు చెందిన దాదాపుగా 60 భవనాలకు జలమండలి అధికారుల అనుమతి లేకుండా తానే వ్యక్తిగతంలో ఒక్కో కనెక్షన్‌కు రూ.3వేల నుంచి రూ.8వేల వరకు వసూలు చేసి అక్రమ కనెక్షన్‌ ఇచ్చినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. అన్నీ డొమిస్టిక్‌ కనెక్షన్లు ఉండగా, మరో 20 కనెక్షన్లకు సంబంధించి విచారణ జరుగుతుంది. సంబంధిత యజమానులతో మెటీరియల్స్‌ తెప్పించుకుని సంస్థకు సంబంధించిన నీటి పైపులైన్‌కు కన్నం పెడుతూ అడ్డగోలుగా నల్లా కనెక్షన్‌ ఇచ్చినట్లు అధికారులు తేల్చారు. ఎండీ దానకిశోర్‌ ఆదేశాల మేరకు శ్రీనుపై చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్‌ 269, 379, 430 ప్రకారం ఫిర్యాదు చేశారు. ఈ నేరానికి చట్ట ప్రకారం ఐదేండ్ల జైలు శిక్ష, జరిమానా విధించబడుతుందని అధికారులు తెలిపారు. కాగా, ఏండ్ల తరబడి ఒకేస్థానంలో పనిచేస్తున్న లైన్‌మన్లపై అధికారుల నిఘా లేని ఫలితంగా విచ్చలవిడిగా అక్రమ నల్లాలు పుట్టుకొస్తుండడం గమనార్హం.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...