హరితహారంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి:కలెక్టర్


Tue,November 5, 2019 02:59 AM

మేడ్చల్ కలెక్టరేట్: హరితహారంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి డీపీవో, మున్సిపల్ కమిషనర్లనుఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో మన నగరం, హరితహారం, సీజనల్ వ్యాధులు, మినరల్ డెవలప్‌మెంట్ ఫండ్స్, రోడ్ల మరమ్మతులు తదితర అంశాలపై కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మననగరం కార్యక్రమంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలకు రంగులు వేసి కనీస సౌకర్యాలు కల్పించాలని, అందుకు మున్సిపల్ నిధులు ఖర్చు చేయాలని కమిషనర్లను ఆదేశించారు.

మున్సిపల్ పొలిమేరల్లో చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయాలని, సూచికబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. విద్య, సంక్షేమ, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల కేంద్రాలను పరిశుభ్రం చేసి వసతులు కల్పించే బాధ్యత మున్సిపాలిటీకే ఉందన్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు పాదులు తీయించి ఎరువులు వేసి ఐరన్ ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.నిజాంపేట్,బాచుపల్లి,దుండిగల్ రోడ్లపై ఏవెన్యూ ప్లాంటేషన్ చేసి ఐరన్ ట్రీగార్డులు, సంరక్షణ లేకుండా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కూకట్‌పల్లిలో అక్టోబర్ 28న నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో డీఆర్‌వో మధుకర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...