స్వచ్ఛ నగరమే లక్ష్యం..


Sun,November 3, 2019 02:05 AM

-ప్రధాన రోడ్లపై ఇక యంత్రాలతో స్వీపింగ్
-అదనంగా 40 యంత్రాల కొనుగోలుకు త్వరలో గ్లోబల్ టెండర్లు
-డివిజన్‌కు 10 మంది అదనపు స్వీపర్ల నియామకం
-పర్యాటక ప్రదేశాల్లో 24 గంటలూ స్వీపింగ్
-త్వరలో మరో 500 స్వచ్ఛ ఆటోలు
-చెత్త తరలింపు కేంద్రాల ఆధునీకరణ
-అపార్ట్‌మెంట్ల చెత్తను బయటకు తెచ్చి ఇవ్వాల్సిందే
-పారిశుధ్యం మెరుగునకు విస్తృత చర్యలు
-బల్దియా సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ నగరాలను స్మోక్‌ఫ్రీ నగరాలుగా ప్రకటించే కార్యక్రమం ప్రారంభమైందని, ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే మొట్టమొదటి స్మోక్‌ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మేయర్ బొంతు రామ్మోహన్ చేసిన ప్రతిపాదనకు కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఢిల్లీ తరహా పరిస్థితులు ఉత్పన్నం కాకముందే అంతా మేల్కొనాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే, ప్రధాన రోడ్లపై స్వీపింగ్‌ను మరింత మెరుగుపర్చేందుకు అదనంగా 40 స్వీపింగ్ మిషన్లను కొనుగోలు చేయనున్నట్లు, వీటికోసం త్వరలో గ్లోబల్ టెండర్లు ఆహ్వానిస్తామని మేయర్ ప్రకటించారు. దీనివల్ల ప్రధాన రోడ్లపై పనిచేస్తున్న 1500 నుంచి 2000 మంది స్వీపర్ల పని ఉండదు కనుక వారిని సమీపంలోని ఇంటర్నల్ రోడ్లపై నియమిస్తామన్నారు. ప్రస్తుతం 20 స్వీపింగ్ మిషన్లు కొనసాగుతుండగా, వీటికి అదనంగా 40 మిషన్లను రంగంలోకి దింపుతామన్నారు. రాత్రి వేళల్లో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన రోడ్లపై మ్యాన్యువల్ స్వీపింగ్‌ను లేకుండా చేయాలని నిర్ణయించామన్నారు. అంతేకాకుండా ఫుట్‌పాత్‌లు, ప్రధాన రోడ్ల నిర్వహణను ఇప్పటికే వార్షిక నిర్వహణ కింద ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు గుర్తు చేశారు.

బల్దియా పాలకమండలి సర్వసభ్య సమావేశం శనివారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు పారిశుధ్యం, డెంగీ వ్యాప్తి, దోమలు తదితర సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుధ్య పనులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యుల లేవనెత్తిన అంశాలపై కమిషనర్ లోకేశ్‌కుమార్‌తోపాటు అధికారులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం మేయర్ బొంతు రామ్మోహన్ పారిశుధ్య పనులను మెరుగుపర్చేందుకు తీసుకోబోయే పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. నగరంలో 27 పర్యాటక ప్రాంతాలున్నాయని, వాటిల్లో 24 గంటలూ స్వీపింగ్‌తోపాటు పచ్చదనం పెంపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా మేయర్ చెప్పారు. దీనికోసం కూడా వార్షిక నిర్వహణ కింద ఏజెన్సీలకు ఖరారు చేస్తామని, వచ్చే వారం రోజుల్లో ఈ ప్రక్రియ మొదలవుతుందన్నారు. అంతేకాకుండా డివిజన్లలో స్వీపింగ్ పనులను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఒక్కో డివిజన్‌కు పది మంది చొప్పున అదనంగా కార్మికులను నియమించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం స్వీపింగ్ పనులు నిర్వహిస్తున్న వారిలో వయసు మీరిన కార్మికులు, అనారోగ్యంతో బాధపడేవారి స్థానంలో వారి బంధువులను నియమించేందుకు ఇది వరకే తీర్మానం చేసినట్లు గుర్తు చేస్తూ, దీనికి ఆయా కార్మికులు ఒప్పుకోకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అటువంటి కార్మికులను ఒప్పించేందుకు కార్పొరేటర్లు చర్యలు తీసుకోవాలని మేయర్ కోరారు.

వాణిజ్య ప్రాంతాల్లో మూడుసార్లు వ్యర్థాల తరలింపు
చెత్త ఇంటింటి సేకరణ కోసం త్వరలో మరో 500 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేయనున్నట్లు మేయర్ చెప్పారు. డీజిల్ వాహనాలు తరుచూ పాడవుతున్నందున ఈసారి సీఎన్‌జీ, లేక బ్యాట్రీతో నడిచే వాహనాలను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వాణిజ్య ప్రాంతాల్లో రోజుకు మూడుసార్లు వ్యర్థాలు తరలించే విధంగా అదనపు వాహనాలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించే ఉద్దేశంతో స్వచ్ఛ ఆటోల ట్రాలీలను రెండుగా విభజించి తప్పనిసరిగా తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముంబై, పుణె, ఇండోర్, భోపాల్ తదితర నగరాల్లో అమలు చేస్తున్న విధంగా తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించేందుకు వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. అంతేకాకుండా, అవసరాలకు అనుగుణంగా ట్రైసైకిళ్లను కూడా పెంచనున్నామని చెప్పారు. చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్లను ఆధునీకరించనున్నట్లు చెప్పారు. వర్షాలకు చెత్త తడిచి దుర్వాసన రాకుండా పైకప్పు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల వద్ద లోడింగ్, అన్‌లోడింగ్‌కు స్వచ్ఛ ఆటోలు గంటల తరబడి వేచివుండాల్సిన అవసరం లేకుండా అదనంగా జేసీబీలు ఏర్పాటు చేస్తామన్నారు.

అవసరానికి అనుగుణంగా మరుగుదొడ్ల నిర్మాణం
కార్మికుల సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా వారికి ప్రమాద బీమా రూ.6 లక్షలు లభించేలా బీమా కల్పించినట్లు, అంతేకాకుండా ఈఎస్‌ఐ దవాఖానల యూనిట్లను మరిన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పలు ప్రాంతాల్లో దాదాపు 600-700 వరకు సామూహిక మరుగుదొడ్లు నిర్మించాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించామని, ప్రభుత్వ స్థలాలు లేకపోవడంవల్ల వాటి నిర్మాణం ముందుకు సాగడం లేదన్నారు. కార్పొరేటర్లు తమ తమ ఏరియాల్లో ఎక్కడైనా ఖాళీ జాగలుంటే గుర్తించాలని, ప్రజలకు అవి అందుబాటులో ఉంటే వాటిలో మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. నిర్మాణ వ్యర్థాల(సీఅండ్‌డీ వేస్ట్) డిస్పోజల్ కోసం జీడిమెట్ల, ఫతుల్లగూడలలో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు, త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయన్నారు. తప్పనిసరిగా జీహెచ్‌ఎంసీ అనుమతించిన వాహనాల్లోనే నిర్మాణ వ్యర్థాలను రవాణా చేయాలన్నారు. లేనిపక్షంలో మొదటిసారి రూ. 25వేలు, రెండోసారి రూ.50వేలు జరిమానా విధించేందుకు, మూడోసారి కూడా తప్పుచేస్తే వాహనాన్ని సీజ్ చేసేందుకు ఇది వరకే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిందన్నారు.

ఐడీపీఎల్ వాసుల సమస్యలు పరిష్కరిస్తాం..
ఐడీపీఎల్ లీజు భూముల్లో దాదాపు 40 ఏండ్లుగా 2500 కుటుంబాలు గుడిసెలు వేసుకొని ఉంటున్నారని, వారికి విద్యుత్ మీటర్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ, అది లీజు భూమి అయినందున ఐడీపీఎల్ అధికారులతో సంప్రదించి పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతం వారు లీజు భూములను ఆక్రమించుకొని ఉంటున్నారని తెలిపారు. అలాగే, రేవంత్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కమిషనర్ సమాధానమిస్తూ, భూగర్భ డ్రైనేజీ నిర్వహణ పూర్తిగా వాటర్‌బోర్డుకు అప్పగించాలనే ప్రతిపాదన ఉందని, అయితే త్వరలో జరిగే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు.

అప్పటి వరకు వాటి నిర్వహణ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉందని, ఇప్పటికీ నిర్వహణ పనులు తామే చేస్తున్నామన్నారు. అలాగే, రోడ్ల వెంబడి చెట్ల కొమ్మలు నరికే బాధ్యత ప్రస్తుతం ట్రాన్స్‌కోకే ఉన్నప్పటికీ త్వరలో జీహెచ్‌ఎంసీ చేపట్టనుందని కమిషనర్ చెప్పారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఒక డివిజన్‌లో తామే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెత్త తరలించేందుకు కంపాక్టర్ వాహనాలు, కంపాక్టర్ బిన్స్‌ను త్వరలోనే అవసరాలకు సరిపడా కొనుగోలు చేయనున్నట్లు కమిషనర్ వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఆమోస్, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీల మృతికి సభ్యులు సంతాపం తెలుపుతూ రెండు నిముషాలు మౌనం పాటించారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...