నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు


Sun,November 3, 2019 01:58 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలో నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటూ..ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మరింత మెరుగైన నీటి సరఫరా, మంచినీటి పొదుపు, వృథాను తగ్గించడం, లెక్కలోకి రాకుండాపోతున్న నీటిని తగ్గించడం కోసం సనత్‌నగర్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్‌ను చేపట్టబోతున్నామని మంత్రి ప్రకటించారు. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో ఎండీ ఎం.దానకిశోర్‌తో కలిసి పైలెట్ ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు పైలెట్ ప్రాజెక్ట్‌ను చేపట్టబోతున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే స్థానిక ప్రజలు, కాలనీ సంఘాలను కలుపుకుని ఏడాదిలో నగర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతామన్నారు. గడిచిన ఐదేండ్లుగా ప్రజలకు మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా జలమండలి కృషి చేస్తున్నదని, కోటి మందికిపైగా ఉన్న నగర జనాభాకు తగినట్లుగా జలమండలి సేవలందిస్తుందని, నగరవాసులకు మంచినీటి సరఫరాలో జలమండలి పనితీరు అద్భుతమని మంత్రి కొనియాడారు.

ఎండీగా దానకిశోర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జలమండలి మరింత మెరుగైన సేవలందిస్తున్నదని ప్రశంసించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ఇంకా సులువైన పద్ధతుల్లో ప్రజలకు చేరువకావాలన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన మంచినీటినందించేందుకు అల్విన్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణం పూర్తయిందని, ఈ రిజర్వాయర్‌ను ఈనెల 7వ తేదీన మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని ఈ సందర్భంగా తలసాని తెలిపారు. ఈ రిజర్వాయర్ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు అంతరాయం లేకుండా నీటినందిస్తామన్నారు. కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, డి.శ్రీధర్‌బాబులతోపాటు సంబంధిత సీజీఎంలు, జీఎంలు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...