చరమాంకంలో.. చేరదీద్దాం..!!


Sun,October 20, 2019 03:29 AM

-క్యాన్సర్ రోగులకు అండగా స్పర్శ్ ధర్మశాల
-వైద్యంతో ఫలితం లేని చివరి రోజుల్లో చేయూత
-ప్రత్యేకంగా పడకలు కేటాయింపు
-చివరి శ్వాస వరకు అన్ని వసతులు ఉచితంగానే
-శేరిలింగంపల్లిలో 60 పడకలు, 10 ప్రత్యేక గదులతో నిర్మాణం
-వచ్చే ఏడాది అందుబాటులోకి
-ప్రస్తుతం బంజారాహిల్స్ స్పర్శ్ ధర్మశాలతో సేవలు
-ఇప్పటికే 3వేల మందికి అండగా నిలిచిన రోటరీ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : క్యాన్సర్.. అదో మహమ్మారి రోగం. ప్రాణాలు తీసేవరకు వదలని భయంకర వ్యాధి. ఖర్చుతో కూడుకున్న వైద్యం. కొంతమంది క్యాన్సర్ నుంచి బయటపడినా.. చాలా సంఖ్యలో ఆ వ్యాధితో ప్రాణాలు వదులుతున్నారు. అయితే క్యాన్సర్‌తో చనిపోయే పేషెంట్లు చివరి రోజుల్లో విపరీతమైన నొప్పి.. జ్వరం.. మాటల్లో చెప్పలేని నరకం అనుభవించి తుది శ్వాస విడుస్తారని వైద్యులు చెబుతున్నారు. దవాఖానల్లో వైద్యం చేసినా ప్రయోజనం లేని వారిని ఇంటికి పంపిస్తారు. ఇంట్లో వాళ్లకు వారిని ఎలా చూసుకోవాలో తెలియదు.. నిరుపేదల కుటుంబాలకు చెందిన వారి పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంటుంది. సరైన వసతులు లేక వారి జీవితాలు చివరి రోజుల్లో కూడా దయనీయంగా ముగుస్తాయి. అయితే క్యాన్సర్‌తో ప్రాణ పోరాటం చేసి అలసిపోయిన అభాగ్యులకు అండగా రోటరీ క్లబ్ బంజారాహిల్స్ సంస్థ స్పర్శ్ ధర్మశాల నిలిచింది. కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వారి జీవితం చివరిలో వెలుగులు నింపడానికి ప్రయత్నిస్తున్నది. చనిపోయే ముందు ఎలాంటి బాధ లేకుండా.. వారి కోరికలు అన్ని నెరవేరేలా చేస్తూ సకల సదుపాయాలను కల్పిస్తున్నది. శేరిలింగంపల్లి నియోజకవర్గం నానక్‌రాంగూడ రోడ్డులోని ఖాజగూడలో 60 పడకలు.. 10 ప్రత్యేక గదులతో భవనాన్ని నిర్మిస్తున్నారు. మరో ఏడాదిలో అందుబాటులోకి రానున్నదని రోటరీ నిర్వాహకులు తెలిపారు.

అమ్మో మహమ్మారి..!!
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రతి నలుగురిలో ఒక్కరూ క్యాన్సర్ బారినపడుతున్నారు. ప్రతి ఏడాది దేశంలో పది లక్షల మంది క్యాన్సర్ నిర్ధారితులవుతున్నారు. అందులో హైదరాబాద్ నుంచి ప్రతి ఏడాది పది వేల మంది క్యాన్సర్ పేషెంట్లు ఉంటున్నారు. అందులో 70 శాతం పేషెంట్లు చివరి దశలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈక్రమంలో చావు అనివార్యం. కానీ అది ఎలాంటి పెయిన్ లేకుండా ఉండాలి అనే సిద్ధాంతంతో రోటరీ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్పర్శ్ ధర్మశాల సేవలందించి ఆదర్శంగా నిలుస్తోంది.

బాధ్యతగా తీసుకుందాం..!!
క్యాన్సర్‌తో చివరిదశలో ఉన్నవారు బంజారాహిల్స్‌లోని రోడ్డునంబర్ 12లో ఉన్న స్పర్శ్ ధర్మశాలను సంప్రదించవచ్చు. మరింత సమాచారం కోసం 9963504253 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఇలాంటి సేవ గురించి తెలియని నిరుపేద కుటుంబాలు ఇంటికి తీసుకెళ్లి పేషెంట్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన లేక రెట్టింపు బాధ అనుభవించే అవకాశం ఉంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే వారిని బాధ్యతగా తీసుకుని స్పర్శ్ ధర్మశాల సేవలు వారికి తెలియజేసి వచ్చేలా చూడాలి. అంతేకాదు స్పర్శ్ ధర్మశాలకు దాతలుగా ముందుకొచ్చి క్యాన్సర్ బాధితులు చివరి దశలో ఆనందంగా ఉండటానికి మనవంతుగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

సకల సదుపాయాలతో..!
వైద్యం చేసినా ఫలితం లేని క్యాన్సర్ పేషెంట్లను రోటరీ క్లబ్ సంస్థ వారు చేరదీస్తారు. వారిని ప్రస్తుతం బంజారాహిల్స్‌లో ఉన్న స్పర్శ్ ధర్మశాలలో చేర్చుకుని సేవలందిస్తారు. వారికి ప్రత్యేకంగా పడక కేటాయించి బాగోగులు చూసుకుంటారు. వారికి సహాయంగా ఒక వ్యక్తిని కూడా అనుమతిస్తారు. వైద్యుల పర్యవేక్షణ, ఆహారం..ఆహ్లాదం మొత్తంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల సదుపాయాలు సమకూర్చుతున్నారు రోటరీ క్లబ్ నిర్వాహకులు. 2011లో మొదలైన ఈ సేవా.. ఇప్పటికే 3 వేల మంది క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచి వారి జీవితం చివరి రోజులను ఆనందదాయకమయ్యేలా కృషి చేశారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో శేరిలింగంపల్లిలో స్పర్శ్ ధర్మశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది దేశంలోనే అత్యాధునిక సదుపాయాలు గల నిర్మాణం. రూ.13.3 కోట్లతో పూర్తికానున్నది. దేశంలో ఇలాంటి తరహా సేవలందించే రాష్ట్రం బెంగళూరు. అయితే అక్కడి కన్నా అత్యాధునిక మిషన్లతో మహానగరంలో అందుబాటులోకి రావడం విశేషం.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...