బంద్ ప్రశాంతం


Sun,October 20, 2019 03:28 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : టీఎస్‌ఆర్టీసీ జేఏసీ బంద్ పిలుపు ప్రభావం నగరంపై పెద్దగా ప్రభావం చూపలేదు. వ్యక్తిగత వాహనాలు, ఎంఎంటీఎస్, హైదరాబాద్ మెట్రో, ఓలా, ఉబర్‌తోపాటు లక్ష ఆటోలు యథావిధిగా తిరిగి ప్రయాణ అవసరాలు తీర్చాయి. దీంతో నగర ప్రయాణికులకు ఇబ్బందులు కలుగలేదు. ముఖ్యంగా పెట్రోల్ బంకులు, దుకాణాలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌మాల్స్ యథావిధిగా తెరిచారు. చిన్న చిన్న దుకాణాలు, చివరకు పాన్‌డబ్బాలు కూడా మూసివేయలేదు. బంద్‌లో నాయకుల ఆర్భాటం తప్ప పెద్దగా ప్రభావేమీ కనబడలేదు. ఆర్టీసీ బస్సులు శుక్రవారంతో పోలిస్తే కొద్దిగా తక్కువగా తిరిగినప్పటికీ నగర ప్రయాణానికి ఎటువంటి ఆటంకం కలుగలేదు. ఆర్టీసీకీ ప్రత్యామ్నాయంగా దక్షిణమధ్య రైల్వేకు చెందిన ఎంఎంటీఎస్‌తోపాటు హైదరాబాద్ మెట్రోరైలు సంస్థలు సమ్మె కాలంలో ఎలాగైతే సేవలందించాయో అదే విధంగా సేవలందించాయి. ఎప్పటి నుంచో 19న ఆర్టీసీ జేఏసీ బంద్ ఉంటుందని ప్రచారం చేసినప్పటికీ నగర ప్రజలు పెద్దగా సహకరించలేదు. కోటికిపైగా జనాభా ఉన్న నగరంలో 65 లక్షల వాహనాలు తిరుగుతుండటంతో చాలా మంది తమ ప్రయాణ అవసరాల కోసం వ్యక్తిగత వాహనాలు వాడుకున్నారు. ఇక దుకాణాలు, పెట్రోల్ బం కులు సమ్మెకు ఏ మాత్రం మద్దతు తెలుపకుండా వ్యాపారం చేశాయి. టీఎస్‌ఆర్టీసీ సమ్మెకు కార్మికుల ప్రయోజనాలు కాకుండా రాజకీయ కోణం సంతరించుకోవడంతో ప్రజలు కూడా హర్షించకుండా బంద్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుకూలంగా బంద్‌లో పాల్గొనలేదు. శాంతియుతంగా బంద్ చేస్తామని ప్రకటించినప్పటికీ ఆర్టీసీ యూనియన్ నేతలు, కార్యకర్తలు హద్దు మీరడంతో శాంతి భద్రతల దృష్ట్యా అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. రవాణాశాఖ రికార్డుల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 60 వేల క్యాబ్‌లు ఉండగా అందులో సుమారు 50 వేల క్యాబ్‌లు యథావిధిగా నడిచాయి.

నడిచిన ఆర్టీసీ బస్సులు
బంద్ పిలుపు ఉన్నప్పటికీ గ్రేటర్ పరిధిలోని ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు రోడ్డెక్కాయి. అవుట్‌సోర్సింగ్ స్టాఫ్‌తో 203 బస్సులు నడిపించారు.ఈ విషయాన్ని స్వయంగా గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

సాఫీగా వ్యాపారాలు..
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ జేఏసీతో కలిసి విపక్షాలు శనివారం ఇచ్చిన రాష్ట్ర బంద్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. తెల్లవారుజాము నుంచే పోలీసులు బందోబస్తును నిర్వహిస్తూ సామాన్యులకు మేమున్నామంటూ భరోసానిచ్చారు. దీంతో బంద్ ప్రభావం ఎక్కడ కూడా కన్పించలేదు. నగరంలో దుకాణాలు, మార్కెట్లు, ఇతరాత్ర సంస్థలన్ని 90 శాతం తెరిచే ఉన్నాయి. బంద్ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నగర పోలీసు అధికారులతో వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసులిచ్చిన భరోసాతో ఉదయం నుంచే నగరంలో పెట్రోల్ బంక్‌లు, సినిమా థియేటర్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలు యథావిధిగా రోజు మాదిరిగానే సాఫీగా వ్యాపారాలను సాగించారు.

డయల్ 100కు సమాచారం..
ఎవరైనా బంద్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే డయల్ 100కు ఫోన్ చేయాలని సీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. దీంతో పాటు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి పోలీసులు నాలుగు నిమిషాల వ్యవథిలోనే చేరుకున్నారు. బలవంతంగా దుకాణాలు మూయించడం, సామాన్యుల ప్రయాణాలకు ఇబ్బందులు కల్గించే ప్రయత్నం చేసిన అంశాలలో డయల్ 100 ద్వారా పోలీసులకు 83 కాల్స్ అందాయి. పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌తో పాటు, జోన్ల డీసీపీలు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...