అంకుర్ దవాఖాన వద్ద అలుముకున్న విషాదఛాయలు


Sun,October 20, 2019 03:25 AM

కాప్రా/మల్లాపూర్/వినాయక్‌నగర్ : సూర్యాపేట జిల్లా నడిగూడెం మండ లం చాకిరాల వద్ద శుక్రవారం రాత్రి ఎన్నెస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఏఎస్‌రావునగర్‌లోని అం కుర్ దవాఖానలో పనిచేసే ఆరుగురు మృతి చెందడంతో దవాఖాన వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటనలో దవాఖాన అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సూపర్‌వైజర్‌గా పనిచేసే అబ్దుల్ అజీజ్(45), నర్సింగ్ సూపరింటెండెంట్ జిబ్సన్ (33), వార్డు బాయ్ సంతోష్(23), మేల్ నర్స్‌గా పనిచేసే నాగేశ్వర్‌రావు(35), రిసెప్షన్‌లో విధులు నిర్వహించే పవన్ కుమార్(23), అకౌంటెంట్‌గా పనిచేసే రాజేశ్(29) మృతి చెందారు. శుక్రవారం వరకు తమతో పనిచేసిన మిత్రులు దవాఖానలోనే పనిచేసే విమలకొండ మహేశ్ వివాహానికి సూర్యాపేట జిల్లా చాకిరాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నగరానికి వచ్చే క్రమంలో తిరిగిరాని లోకాలకు వెళ్లడం దవాఖాన సిబ్బందిని కలచివేసింది. అజీజ్ నాగారంలో నివసిస్తుండగా, జిబ్సన్ తిరుమలగిరి, సంతోష్ వినాయక్‌నగర్, నాగేశ్వర్‌రావు దమ్మాయిగూడ, పవన్ నేరెడ్‌మెట్, రాజేశ్ కుషాయిగూడలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. దవాఖానకు చెందిన ఆరుగురు సిబ్బంది మృతి చెందడంతో డాక్టర్లు, ఇతర సిబ్బంది షాక్‌లో నుంచి తేరుకోలేదు. దవాఖానలో పనిచేసే ప్రధాన సిబ్బంది, మృతుల బంధువులు ఘటనా స్థలానికి తరలివెళ్లడంతో వారికి సంబంధించిన పూర్తి వివరాలేవీ తెలియ రాలేదు. దవాఖాన వద్ద ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వపన్‌కుమార్ అంత్యక్రియలు జనగామ జిల్లా సోలిపురంలో, సంతోష్ అంత్యక్రియలు వినాయక్‌నగర్‌లో నిర్వహించనున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...