లక్కీ దుకాణం..


Sat,October 19, 2019 01:43 AM

-మూడు జిల్లాల్లో లాటరీ ద్వారా 560 మద్యం దుకాణాల కేటాయింపు
-తక్కువ దరఖాస్తులు రావడంతో 9 షాపులకు పెండింగ్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 560 మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులను శుక్రవారం ఆయా జిల్లాల సంయుక్త కలెక్టర్ల చేతుల మీదుగా లాటరీ పద్ధతిన ఖరారు చేశారు. మొత్తం 569 దుకాణాలు ఉండగా వీటి లో 9 దుకాణాలకు సంబంధించి దరఖాస్తులు సరాసరికంటే తక్కువగా రావడంతో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడ్డారనే అనుమానంతో సంబంధిత దుకాణాల దరఖాస్తులను లాటరీ తీయకుండా అధికారులు నిలిపివేశారు. విచారణ జరిపిన తరువాతే నిలిపివేసిన దుకాణాలకు కొత్తగా నోటిఫికేషన్ వేయడమో లేక లాటరీ పద్ధతిన డ్రా తీయడమో చేస్తామని హైదరాబాద్ జిల్లా డిప్యూటి కమిషనర్ వివేకానందరెడ్డి, రంగారెడ్డి జిల్లా డిప్యూటి కమిషనర్ మహ్మద్ ఖురేషీ వెల్లడించారు.

హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలో ఏడు షాపులు నిలిపివేత
హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలోని 173 మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులను అంబర్‌పేటలోని రాణాప్రతాప్‌సింగ్ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం ఉదయం జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రవి, డీఆర్‌వో వి.భూపాల్‌ల ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన డ్రా తీశారు. హైదరాబాద్ ఈఎస్ యూనిట్ పరిధిలోని 79 దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రవి డ్రా తీసి మద్యం దుకాణాలను లైసెన్సీలకు కేటాయించారు. అయితే 79దుకాణాల్లో మూడు దుకాణాలకు సరాసరికంటే తక్కువ దరఖాస్తులు వచ్చినందున సదరు దుకాణాల దరఖాస్తులను నిలిపివేసినట్లు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీలం శ్రీనివాస్ వెల్లడించారు. సికింద్రాబాద్ పరిధిలోని 94 దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులను డీఆర్‌వో భూపాల్ లాటరీ పద్ధతిన డ్రా తీసి లైసెన్సీలకు షాపులను కేటాయించారు.

వీటిలో 4 దుకాణాలకు సరాసరికంటే తక్కువ దరఖాస్తులు వచ్చినందున నాలుగు దుకాణాల దరఖాస్తులను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలో మొత్తం 7 దుకాణాలకు సంబంధించి ప్రతి దుకాణానికి సరాసరిగా 9 దరఖాస్తులు రావల్సి ఉండగా హైదరాబాద్ ఈఎస్ పరిధిలోని ధూల్‌పేట, గోల్కొండ ఎక్సైజ్ స్టేషన్‌ల పరిధిలోని గెజిట్ సీరియల్ నెంబర్ 53వ నెంబర్ షాపునకు 3 దరఖాస్తులు, 68నెంబర్ షాపునకు 4, 69 నెంబర్ షాపునకు 4దరఖాస్తులు మాత్రమే రావడంతో వ్యాపారులు సిండికేట్ అయినట్లు అనుమానించి సదరు దుకాణాల టెండర్ల ఖరారును నిలిపివేసినట్లు జిల్లా డీసీ వివేకానందరెడ్డి, ఈఎస్ సీలం శ్రీనివాస్ వెల్లడించారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

రంగారెడ్డి జిల్లా పరిధిలో ..
రంగారెడ్డి జిల్లా పరిధిలోని 195 దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులను కొంగరకలాన్‌లోని కృష్ణా గార్డెన్స్‌లో ఉదయం 11.30గంటలకు జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్.హరీశ్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన మద్యం దుకాణాలను ఖరారు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొత్తం 422 దుకాణాల్లో విభజిత రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలోని 376 దుకాణాలకు లాటరీ పద్ధతిన డ్రా తీసి మద్యం దుకాణాలను కేటాయించినట్లు జిల్లా డిప్యూటి కమిషనర్ మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. రంగారెడ్డి డివిజన్‌లో ప్రతి దుకాణానికి సరాసరి 21 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. రంగారెడ్డి రెవెన్యూ జిల్లా పరిధిలోని శంషాబాద్ ఈఎస్ యూనిట్ పరిధిలో 81, సరూర్‌నగర్‌లో 114దుకాణాలను లాటరీ ద్వారా లైసెన్సీలను కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...