పారదర్శకతతో లోపాలకు చెల్లు


Thu,October 17, 2019 12:41 AM

-మంచినీటి, మురుగునీటి వ్యవస్థల జియోట్యాగింగ్
-త్వరలో జలమండలి సెంట్రల్ సర్వర్‌లోకి వివరాలు
-జీఐఎస్ ఆధారంగా డేటాబేస్ రూపకల్పన
-పైపులైన్లు, వాల్వ్‌లు, మ్యాన్‌హోళ్లు, నీటి సరఫరా వివరాలన్నీ నిక్షిప్తం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలకు సంబంధించి ప్రతి అంశం ఆన్‌లైన్‌లో నిక్షిప్తం కానున్నది. ఆయా ప్రాంతాల్లో ఎంత సామర్ధ్యం కలిగిన తాగునీటి పైపులైన్ ఉంది? వాల్వ్‌లు, జాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? జంక్షన్ల వద్ద లీకేజీలు ఏమైనా ఉన్నాయా? పైపులైన్ నాణ్యత ఏ మేర ఉంది? సంబంధిత పైపులైన్ పునరుద్ధరించాల్సి వస్తే తక్షణం తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఒక్క డాకెట్ (ప్రాంతాల పరిధిలో) నల్లా కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి? ఎంత మేర నీటి సరఫరా జరుగుతున్నది? సివరేజీ వ్యవస్థ ఎక్కడెక్కడ ఎంత ఉన్నది? ఇలా అనేక ప్రశ్నలకు ఒక్క క్లిక్‌తో సమస్త సమాచారం తెలిసిపోతుంది. జలమండలికి సంబంధించిన వివరాలన్నింటినీ జియోగ్రాఫిక్ ఇన్మర్మేషన్ సిస్టం (జీఐఎస్) ఆధారంగా కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి సమగ్ర డాటా బేస్ రూపకల్పనకు అధికారులు శ్రీకారం చుట్టారు.

1400 స్కేర్ కిలోమీటర్లు (ఔటర్ రింగు రోడ్డు వరకు) సంస్థ సేవల పరిధి విస్తరించి ఉండడంతో కోర్ సిటీతో పాటు శివారు మున్సిపాలిటీలలో రూ.1900 కోట్లతో చేపట్టిన తాగునీటి వ్యవస్థకు జియో ట్యాగింగ్ చేపట్టారు. గడిచిన కొన్ని నెలలుగా క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే హడ్కో ప్రాజెక్టు కింద చేపట్టిన మంచినీటి సరఫరా పైపులైన్ వ్యవస్థ వివరాలను సర్వే జరిపిన అధికారులు డాటాబేస్‌లోకి చేర్చుతున్నారు. ఇదే సమయంలో కోర్ సిటీలో సర్వే ప్రక్రియ యుద్ధ పాతిపదికన జరుగుతున్నది. కాగా సర్వే పూర్తి చేసి ఖైరతాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ సర్వర్‌లోకి వివరాలన్నీ చేర్చేందుకు మరికొన్ని నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

జీఐఎస్‌తో ప్రయోజనాలు
శరవేగంగా విస్తరిస్తున్న గ్రేటర్ సిటీలో భవిష్యత్తులో తాగు, మురుగునీటి విస్తరణ పథకాల అమలు, ఏఏ ప్రాంతాలకు సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉంది? ఏ ప్రాంతాలకు లేదన్న విషయాలను తెలుసుకునేందుకు వీలుగా ఈ విధానం దోహదపడనున్నది. పైపులైన్ లేని చోట దశల వారీగా అభివృద్ధి చేసేందుకు సులువుగా ఉంటుంది. పౌరులకు అవినీతిరహిత సేవలు అందించడం, కండ్ల ముందున్న సమాచారంతో త్వరితగతిన పరిష్కారం చూపడం, పనుల్లో పారదర్శకత పెంచడం వంటి అంశాలే లక్ష్యంగా ఈ జీఐఎస్ విధానం అమలు చేస్తున్నారు. ఇప్పటికే హడ్కో నిధులు రూ.1900 కోట్లతో ఏర్పాటు చేసిన పైపులైన్లు, రిజర్వాయర్లు, వాల్వ్‌లు, జంక్షన్లు తదితర సమాచారాన్ని జీఐఎస్ ఆధారంగా సమగ్ర డేటాబేస్‌ను ఆన్‌లైన్‌లోకి చేర్చారు. ఎక్కడ ఏ పనులు చేపట్టలన్నా? క్షేత్రస్థాయిలోని సాధ్యాసాధ్యాలు 80 శాతం మేర వెంటనే అంచనా వేసుకొనే వీలు ఉంటుంది. క్షేత్రస్థాయి సిబ్బందిపై ఆధారపడకుండా ఉండటమే కాకుండా భవిష్యత్తులో చేపట్టబోయే పథకాలకు మార్గదర్శకంగా నిలవనున్నది.
డేటాబేస్‌తో ప్రయోజనాలు
-పైపులైన్లు, వాల్వ్‌ల సమాచారం ఒకసారి బోర్డు డేటాబేస్‌లో నిక్షిప్తం చేస్తే భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు రహదారులు తవ్వితే పైపులైన్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
-లీకేజీలను సమగ్రంగా అరికట్టవచ్చు. డబుల్ ఎస్టిమేట్స్‌కు ఆస్కారం ఉండదు. అక్రమ కనెక్షన్లను నిరోధించవచ్చు. పనుల్లో పారదర్శకత పెరుగనున్నది.
-పురాతన పైపులైన్లపై స్పష్టత రానున్నది. ముఖ్యంగా గ్రౌండ్ లెవల్ సర్వీసు రిజర్వాయర్లు (జీఎల్‌ఎస్‌ఆర్), ఎలివేటెడ్ లెవల్ సర్వీసు రిజర్వాయర్ (ఈఎల్‌ఎస్‌ఆర్)ల లీకేజీ, నాణ్యత, మన్నిక, సామర్ధ్యం, సైడ్ వాల్వ్‌లు ఎలా ఉన్నాయి? అనే విషయాలు వెలుగులోకి వస్తాయి.
-100 నుంచి 1300 ఎంఎం డయా వ్యాసార్ధం గల పైపులైన్ల వివరాల నమోదు ద్వారా ఆయా పైపులైన్లలో ఏ కాలనీ, ఏ బస్తీ, వీధికి రోజు వారీగా ఎంత మొత్తంలో నీరు వెళ్తుందో ఇట్టే తెలుసుకోవచ్చు.
-ప్రతి నీటి చుక్కను శాస్త్రీయంగా లెక్కించడం ద్వారా నీటి ఆడిటింగ్‌కు వీలవుతుంది.
-నీటి వృథాను 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గించవచ్చు.
-మహానగరం పరిధిలో సంస్థకు ఇప్పటికే సుమారు 9వేల కి.మీ. మేర విభిన్న పరిమాణంలో పైపులైన్లు ఉన్నాయి. వీటి డేటాను కూడా దశల వారీగా సేకరించి బోర్డు డేటాబేస్‌లో నిక్షిప్తం చేసేందుకు మార్గం సుగమం కానున్నది.
-పైపులైన్లు, వాల్వ్‌లు, జాయింట్లు, జంక్షన్లకు లీకేజీలు ఏర్పడినప్పుడు వాటి వివరాలు ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు.
-వాటి మరమ్మతులకయ్యే వ్యయాన్ని శాస్త్రీయంగా లెక్కించవచ్చు. దీంతో సిబ్బంది చేతివాటానికి చెక్ పడుతుంది.
-సంస్థ పరిధిలోని బస్తీలు, కాలనీల్లో ఏర్పాటు చేసిన పైపులైన్లు, రిజర్వాయర్లు, వాటిలో నీటిని నింపే ఇన్‌లెట్ పైపులైన్లు, రిజర్వాయర్ల నుంచి ఏఏ కాలనీలకు నీళ్లు వెళ్తున్నాయో తెలుసుకునే వీలు ఉంటుంది.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...