మినీ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తాం


Wed,October 16, 2019 12:39 AM

మేడ్చల్, నమస్తే తెలంగాణ : మేడ్చల్‌లో మినీ స్టేడియాన్ని అభివృద్ధిపర్చి త్వరలోనే క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ చెక్‌పోస్టు సమీపంలో అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియం, సమీప పరిసరాలను మంగళవారం అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో అత్యంత విలువైన ప్రదేశంలో ఉన్న మినీ స్టేడియం విద్యార్థులకు, క్రీడాకారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. వెంటనే స్టేడియం స్థలాన్ని సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని, స్టేడియంలో నిలిచిన వ్యర్థ జలాలు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్టేడియాన్ని శుభ్రపరిచి ఆధునీకరించాలని, కంపెనీల వ్యర్థ జలాలు స్టేడియంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల సమీప కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాంత పరిశ్రమల యాజమాన్యాలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని, అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మూడు, నాలుగు నెలల్లోనే అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీ వాసులు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మ జగన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్‌యాదవ్, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నందారెడ్డి, నాయకులు మర్రి రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, జగన్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, నర్సింహారెడ్డి, నరేందర్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...