అభాగ్యులకు అభయం


Wed,October 16, 2019 12:38 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అభాగ్యులకు అభయ ఫౌండేషన్ అండగా నిలుస్తున్నది. దాతల సహాయంతో పలు సేవాకార్యక్రమాలు చేపడుతున్నది. 13 ఏండ్ల కిందట సేవే పరమావధిగా సీఎస్.బాలచంద్ర స్థాపించిన అభయ ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల చెన్నైలో వరదలు వచ్చినప్పుడు ఫౌండేషన్ సభ్యులు ఆహారప్యాకెట్లు, దుప్పట్లు పంచి వారి సేవదృక్పథాన్ని చాటుకున్నారు. అంతేకాదు మహిళలు సాధికారత సాధించేలా పలు విభాగాల్లో శిక్షణ ఇస్తూ స్వయంగా ఎదిగేల మార్గదర్శనం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో దేశం కోసమే తన జీవితమని స్పష్టం చేసిన అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సీఎస్.బాలచంద్ర సుంకు నమస్తే తెలంగాణతో ఫౌండేషన్ గురించి ముచ్చటించారు.

తనకు అందిన సాయమే.. నేడు అభయ..!!
సేవ చేయడమే జీవిత లక్ష్యంగా మార్చుకున్న బాలచంద్ర జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన తండ్రి అడ్వకేట్. విద్యాభ్యాసం సరస్వతి శిశుమందిర్‌లో జరిగింది. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎఫ్‌సీఎస్ చదివారు. అయితే చదువు కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లాల్సి వచ్చింది. బెంగళూరుకు వెళ్లినప్పుడు అతడు తన బంధువులు, స్నేహితుల ఇంట్లో ఉండాల్సి వచ్చేది. అప్పుడు తనకు లభించిన ఆదరణ, సాయం తనలో ఇతరుల పట్ల గౌరవం మరింత రెట్టింపు అయ్యేలా చేసింది. ప్రతి సమస్యలోనూ వారి నుంచి పొందిన సాయం అతడిని సేవ మార్గంలో నడిపించిందనడంలో అతిశయోక్తి లేదు. ఉన్నతమైన చదువు, మంచి తెలివితేటలు.. ఉన్న అతడికి ఉద్యోగానికి కొదవలేదు. కాని వాటన్నింటిని వదులుకొని సేవారంగంలోకి వచ్చారు. 2006 అక్టోబర్‌లో అభయ ఫౌండేషన్ స్థాపించారు. ఇబ్రహీంపట్నంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు అండగా నిలుస్తూ.. విపత్తులు, ప్రమాదాలు ఎదురయినప్పుడు సాయంగా నిలుస్తున్నారు. అనారోగ్య బాధితులకు ఫౌండేషన్ ద్వారా సర్జరీలు చేయించారు. ఇప్పటి వరకు 800 మందికి పలు సర్జరీలు చేయించారు. గల్ఫ్ దేశాల్లో బాధితులకు అండగా నిలుస్తున్నారు.

హార్ట్ అనే సూత్రంతో..!!
ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయాలనేది అభయ ఫౌండేషన్ సిద్ధాంతం. అందుకే అభయ ఫౌండేషన్ హార్ట్ అనే సూత్రంతో నడుస్తున్నది. హెచ్‌ఈఏఆర్‌టీ(హార్ట్)లో హెచ్ అంటే హెల్తీ.. ఈ అంటే ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్‌మెంట్, ఏ అంటే..అవేర్నెస్ అండ్ అస్యూరెన్స్.. ఆర్ అంటే.. రూరల్ లీడర్‌షిప్ అండ్ డెవలప్‌మెంట్.. టీ అంటే.. ట్రాన్స్‌ఫర్మేటివ్ అనే ప్రిన్సిపుల్‌తో బాలచంద్ర పనిచేస్తున్నారు. దాతలు ఎవరైన సాయం చేయాలనుకుంటే www.abhayafoundation.org లోకి వెళితే సమాచారం అంతా ఉంటుంది.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...