హెల్మెట్ ధరిస్తే ఆయుష్షుకు భరోసా..


Fri,October 11, 2019 03:34 AM

-శిరస్ర్తాణం లేకపోవడంతో ఇద్దరు దుర్మరణం
-చేవెళ్ల రోడ్డు ప్రమాదాన్ని విశ్లేషించిన ట్రాఫిక్ పోలీసులు
-వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించడం శ్రేయస్కరం
- లైసెన్స్ తీసుకున్న తర్వాతే వాహనాన్ని నడపాలి: డీసీపీ విజయ్‌కుమార్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హెల్మెట్ లేని ప్రయాణం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇటీవల చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలో రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఒకరు బైక్ నడిపిస్తున్న వ్యక్తి కాగా, మరో బైక్‌పై వెనకాల కూర్చున్న మహిళ మృతి చెందారు. వాహనాలు నడిపిస్తున్న ఈ ఇద్దరి వాహనదారులకు సరైన విధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో భద్రతతో కూడిన డ్రైవింగ్‌పై అవగాహన లేక చేసిన డ్రైవింగ్ వారి ప్రాణాల మీదకు తెచ్చిందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనను విశ్లేషించిన ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటనలో ఇద్దరికి తలకు గాయం కావడంతోనే మృతి చెందారని, హెల్మెట్ ధరించిన మరో వాహనదారుడు సురక్షితంగా ప్రాణ పాయం నుంచి బయటపడ్డారని తేల్చారు. కాబట్టి ద్విచక్రవాహనం మీద ప్రయాణిస్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం సురక్షితమని స్పష్టం చేస్తున్నారు.

వాహనం నడిపించే వ్యక్తే కాదు వెనకాల కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరిస్తే వారికి భద్రతను ఇస్తుందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. వాహనాన్ని స్టార్ట్ చేయడం....వచ్చీరాని డ్రైవింగ్‌తో వాహనాన్ని నడపడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన హెచ్చరిస్తుందని సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే...ఈ 5వ తేదీన గోపాని లక్ష్మయ్య తన బైక్ పై వెళ్తూ న్యాటల గేటు ఎమ్‌కోర్ కంపెనీ దామరగిడ్డ గ్రామం దగ్గర ఎదురుగా బైక్‌పై వస్తున్న భార్య, భర్తలు పద్మ, రాంచంద్రయ్యల ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య, పద్మల తలకు తీవ్ర గాయాలవడంతో ఇద్దరు చనిపోయారు. హెల్మెట్ ధరించిన రాంచంద్రయ్య గాయాలతో బయటపడ్డాడు. వైద్య పరీక్షల్లో కూడా ఈ ఇద్దరు తలకు గాయం కావడంతోనే మరణించారని పరిశీలనలో తేలింది. అదే వారు హెల్మెట్ ధరించి ఉంటే గాయాలతో బయటపడే వారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాహనం నడిపించే వ్యక్తితో పాటు వెనకాల కూర్చున వారు కూడా హెల్మెట్ ధరించడం సురక్షితమని పేర్కొంటున్నారు. అదే విధంగా లైసెన్స్ పొందిన తర్వాతనే వాహనాలను నడిపిస్తే వారికి రోడ్డు భద్రత విషయాలు తెలుస్తాయని పోలీసులు సూచిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు చాలా మంది హెల్మెట్ లేకపోవడంతోనే తలకు తీవ్ర గాయాలు తగిలి చనిపోతున్నారని పేర్కొంటున్నారు. వాహనదారులు కూడా హెల్మెట్ ధరించి సురక్షితంగా రోడ్లపై ప్రయాణించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం. విజయ్‌కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...