నిర్లక్ష్యానికి జరిమానా


Fri,October 11, 2019 03:31 AM

కూకట్‌పల్లి, పేట్‌బషీరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : కూకట్‌పల్లి జోన్ పరిధిలో గురువారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో కూకట్‌పల్లి, మూసాపేట్, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, ఆల్వాల్ సర్కిళ్ల పరిధిలో మొత్తం 96 మందికి, రూ.9,92,100 జరిమానాలు విధించారు. జోనల్ కమిషనర్ మమత ఆదేశాల మేరకు ఆయా సర్కిళ్లలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు రోడ్లపై చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలను పారబోస్తున్న వారిని గుర్తించారు. కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో 20 మందికి రూ.3,12,500, మూసాపేట్ సర్కిల్ పరిధిలో 11 మందికి రూ.4,40,000, కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో 36 మందికి రూ.9,6,600, గాజులరామారం సర్కిల్ పరిధిలో 21 మందికి రూ.1,28,000, అల్వాల్ సర్కిల్ పరిధిలో 8 మందికి రూ.15వేలు, మొత్తం 96 మందికి రూ.9,92,100 జరిమానా విధించారు.

మూసాపేట్ సర్కిల్ పరిధిలో..
మూసాపేట్ సర్కిల్ పరిధిలో రోడ్లపై నిర్మాణ వ్యర్థాలు, చెత్త చెదారం పారబోస్తున్న వారికి డీసీ మోహన్‌రెడ్డి భారీ జరిమానాలు విధించారు. సర్కిల్ పరిధిలోని కేపీహెచ్‌బీకాలనీ రోడ్డు నంబరు2, రోడ్డు నంబరు 4లలో రోడ్డుపై నిర్మాణ వ్యర్థాలు పారబోసిన నిర్మాణ దారులకు రూ.2 లక్షలు జరిమానా విధించారు. కేపీహెచ్‌బీకాలనీ రోడ్డు నంబరు ఒకటిలోని రిలియన్స్ ట్రెండ్స్ ఎదురుగా చెత్తాచెదారం పేరుకు పోవడంతో రిలియన్స్ ట్రెండ్స్ యాజమాన్యానికి రూ.10వేలు జరిమానా విధించారు. రోడ్డు నంబరు 2, 4లలో నిర్మాణంలో ఉన్న భవనాల ముందు నిర్మాణ వ్యర్థాలను పారబోయడంతో ఇరువురికి రూ.2 లక్షలు చొప్పున జరిమానా విధించారు.
కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలో..
కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ మంగతాయారు, గాజులరామారం ఉప కమిషనర్ రవీంద్రకుమార్‌ల నేతృత్వంలో మద్యం దుకాణాలపై దాడులు నిర్వహించారు. షాపూర్‌నగర్ రైతుబజార్ సమీపంలోని ఎంజే వైన్స్‌కు రూ.50 వేలు జరిమానా విధించారు. కుత్బుల్లాపూర్‌లోని రాయల్, శివశివాని, వెంకటేశ్వర, సుచిత్రలోని తేజ, జీడిమెట్లలోని లిక్కర్ మార్ట్, సుచిత్రలోని సెవెన్ హిల్స్ మద్యం దుకాణాల ముందు ప్లాస్టిక్ గ్లాసులు, బాటిళ్లతో పాటు ఇతర వ్యర్థాలను కుప్పలుగా పెట్టారు. గమనించిన అధికారులు ప్రతి దుకాణానికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారు. చిన్న చిన్న దుకాణదారులు ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారని గమనించి జరిమానా వేశారు. మొత్తం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని దుకాణదారుల నుంచి రూ.96,600, గాజులరామారం సర్కిల్ పరిధిలో నిబంధనలు అతిక్రమించిన వారి నుంచి రూ.1.28 లక్షలు జరిమానాల రూపంలో వసూలు చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి మహిపాల్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...