60 శాతం క్యూలెక్స్ దోమలే


Fri,October 11, 2019 03:30 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్ హైదరాబాద్‌లో దోమలపై నిర్వహించిన సర్వేలో అత్యధికంగా 60శాతంకు పైగా క్యూలెక్స్ దోమలు ఉత్పత్తి అవుతున్నాయని తేలింది. హైదరాబాద్ నగరంలో గత మూడు నెలలుగా డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులకు గురైన వారి ఇండ్లు, పరిసర ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం లార్వా సర్వే నిర్వహించింది. అయితే ఎనాఫిలిస్ దోమల ఉత్పత్తి నామమాత్రంగానే ఉందని పరిశీలనలో తేలిందని అధికారులు తెలిపారు. ఈ క్యూలెక్స్ దోమలు అధిక శాతం మగజాతి క్యూలెక్స్ దోమలు (మేల్ క్యూలెక్స్) ఉండగా వీటి వల్ల అంతగా ప్రమాదం లేదని, ఎనాఫిలిస్ దోమల వల్ల మలేరియా వ్యాధి, ఎడీస్ అగెఫ్టి దోమల వల్ల డెంగీ, చికెన్‌గున్యా సోకుతుందని ఎంటమాలజీ విభాగం అధికారులు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో నిర్వహించిన లార్వా సర్వే ఖైరతాబాద్ జోన్‌లోని పలు సర్కిళ్లలో నిర్వహించగా క్యూలెక్స్ దోమల ఉత్పత్తి అధికంగా ఉందన్నారు.

ప్రజల సహకారంతోనే సీజనల్ వ్యాధుల నివారణ
వివిధ అంటు, సీజనల్ వ్యాధులకు కారణమయ్యే దోమల నివారణకు నగరవాసులు బాధ్యతాయుతంగా నివారణ చర్యల్లో పాల్గొంటేనే డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణ సాధ్యమని జీహెచ్‌ఎంసీ భావిస్తున్నది. ఇటీవల కాలంలోఅధికంగా ఉన్న డెంగీ వ్యాధిని కలుగజేసే ఎడీస్ అగెఫ్టి లార్వా సంపన్న వర్గాలు, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఉండే ఇండ్లలో నీటి నిల్వల ద్వారా సంభవిస్తున్నాయి.
కనీసం రెండు రోజులకు ఒకసారి పూలకుండీల కింద, ఇతర ప్రదేశాలలో ఉన్న నీటిని తొలగించడం స్వచ్ఛందంగా చేపట్టాలని నగరవాసులకు అవగాహణ కల్పిస్తున్నారు. దీంతో పాటు మూసీలో పారే మురుగునీటిలో, మురుగు కాలువల్లో ఉత్పత్తయ్యే క్యూలెక్స్ దోమల నిర్మూలనకు పెద్దఎత్తున యాంటి లార్వా మందును పిచికారి చేస్తున్నారు. అయితే అధిక మొత్తంలో ఉత్పత్తయ్యే క్యూలెక్స్ దోమ ద్వారా బోధకాలు, మెదడు వాపు వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉన్నందున ఈ దోమల నివారణకు కూడా విస్తృత చర్యలను చేపడుతున్నది. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజి విభాగం వద్ద ప్రతి మున్సిపల్ వార్డుకు ఒకటి చొప్పున 150 పోర్టబుల్, ప్రతి జోన్‌కు రెండు చొప్పున, వాహనాలకు అమర్చిన 13 ఫాంగింగ్ మిషన్లు, ప్రతి యాంటి లార్వా ఆపరేషన్ బృందాలకు ఒకటి చొప్పున 668 నాప్ సాక్ స్ప్రేయర్లు, ప్రతి సర్కిల్‌కు ఒకటి చొప్పున 30 పవర్ స్ప్రేయర్ల ద్వారా 2300లకు పైగా ఎంటమాలజీ సిబ్బంది ప్రతి రోజు కనీసం 150 కాలనీలు, బస్తీల్లో ఫాగింగ్ నిర్వహిస్తున్నారు. వీటితో పాటు మరో 150 ఫాగింగ్ మిషన్లను కూడా జీహెచ్‌ఎంసీ సమకూర్చుకుంటున్నది. కాగా జీహెచ్‌ఎంసీ చేపట్టిన విస్తృత నివారణ కార్యక్రమాల ద్వారా డెంగీ వ్యాధి పాజిటివ్ కేసుల నమోదు గణనీయంగా తగ్గినట్లు అధికారులు తెలిపారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...