నేడు ట్యాంక్‌బండ్‌పై మహా బతుకమ్మ


Sun,October 6, 2019 02:58 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ట్యాంక్‌బండ్‌పై ఆదివారం భారీ సంఖ్యలో మహిళలచే బతుకమ్మ పండుగ నిర్వహణకు జీహెచ్‌ఎంసీ, పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మ శోభాయాత్ర నిర్వహించనున్నారు. శోభాయాత్ర జరిగే మార్గంతోపాటు నిమజ్జనం చేసే బతుకమ్మ ఘాట్ వద్ద తగిన ఏర్పాట్లు చేశారు. రోడ్డు మరమ్మతులు, పారిశుధ్యం పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సుమారు ఆరు వేల మంది మహిళలు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి జోన్ నుంచి వెయ్యి మంది స్వయం సహాయక బృందాల మహిళలు హాజరయ్యేలా 120 వాహనాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం నుంచి ఎల్బీ స్టేడియానికి మహిళలు చేరుకొని బతుకమ్మలను పేరుస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 3 గంటలకు ఎల్బీస్టేడియం నుంచి మహిళలు బతుకమ్మలతో ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపుగా వచ్చి బతుకమ్మ ఆడుతారు. అనంతరం బతుకమ్మ ఘాట్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. దీనికోసం బతుకమ్మ ఘాట్‌ను శుభ్రం చేసి శుభ్రమైన నీటితో నింపినట్లు అధికారులు తెలిపారు.

సద్దుల బతుకమ్మ సందర్భంగా అప్పర్ ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌మార్గ్‌లో ఆదివారం సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు చేపడుతూ నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -తెలుగుతల్లి, కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్‌బండ్ మీదుగా సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి లేదు. -సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్ వద్ద బైబుల్ హౌస్ మీదుగా తెలుగుతల్లి ైఫ్లెఓవర్ వైపు మళ్లిస్తారు.

-కవాడిగూడ నుంచి వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్‌పైకి అనుమతి లేదు. ఆ వాహనాలను డీబీఆర్ మిల్స్ వద్ద కట్టమైసమ్మ ఆలయం వైపు మళ్లిస్తారు.
-ఎక్బాల్‌మినార్ నుంచి వచ్చే వాహనాలను, సచివాలయం పాతగేట్ వద్ద ైఫ్లెఓవర్‌పైకి మళ్లిస్తారు. -పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ ైఫ్లెఓవర్ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్‌రోడ్డు ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మళ్లిస్తారు. -నల్లగుట్ట నుంచి బుద్దభవన్ వైపు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద ఈ వాహనాలను మళ్లిస్తారు. -హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వాహనాలను జీహెచ్‌ఎంసీ వైజంక్షన్ వద్ద మళ్లిస్తారు. -ముషీరాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వద్ద మళ్లిస్తారు. -ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్ స్వీకార్-ఉపకార్ వద్ద మళ్లిస్తారు. సిటీ బస్సులను కర్బాలా మైదాన్ వద్ద మళ్లిస్తారు.

బతుకమ్మ వేడుకలకు వచ్చే వారికి పార్కింగ్ స్థలాలు!
స్నో వరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, ప్రసాద్ హైమాక్స్ పక్కన డాక్టర్స్ కార్స్, ఎంఎస్ మక్తా, ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఉన్న మీకోసం పార్కింగ్, బుద్ద భవనం వెనుక వైపు వాహనాలను పార్కు చేసుకోవాలి.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...