24/7 నీళ్లు


Sat,October 5, 2019 01:06 AM

-నిరంతర సరఫరా కోసం కొన్ని ప్రాంతాల ఎంపిక
-నీటి ఎద్దడిని శాశ్వతంగా దూరం చేసేందుకు కసరత్తు ప్రారంభించిన జలమండలి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్ ప్రజలకు తాగునీటి కష్టాలు దూరం చేసిన ప్రభుత్వం ఇక నిరంతరం నీటి సరఫరాపై దృష్టి సారించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత నీటి సరఫరాలో ఎన్నో సంస్కరణలు చేపట్టి సమృద్ధిగా నీటి సరఫరాకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టి మండు వేసవిలో కూడా నీటి ఎద్దడి లేకుండా చేయడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా చర్యలు ప్రారంభించింది. రిజర్వాయర్ల నీటి లభ్యత మెరుగ్గా ఉండడం, భవిష్యత్తులో కూడా జనాభా, నీటి అవసరాలకు అనుగుణంగా కేశవాపూర్‌లో భారీ రిజర్వాయర్ చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్ 18 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్ 10, కృష్ణా మూడు దశల ద్వారా 273, గోదావరి పథకంతో 167లు కలిపి నిత్యం 468 మిలియన్ గ్యాలన్ ఫర్ డే (ఎంజీడీల ) నీటిని ప్రజలకు అందిస్తున్నారు.

ప్రాంతాల వారీగా రెండు రోజులకొకసారి నీటి సరఫరా అందిస్తున్న రోజూ వారీ డిమాండ్ కంటే ఎక్కువగానే నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాగు, మురుగునీటి వ్యవస్థ పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లో 24x7 (నిరంతర) నీటి సరఫరా అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేపట్టాలని ఇటీవల మంత్రి కేటీఆర్ జలమండలి అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో జీఎం (జనరల్ మేనేజర్లు) నిరంతర నీటి సరఫరాకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా రూ. 1900కోట్లలో చేపట్టిన శివారు సర్కిళ్లలో నిరంతర నీటి సరఫరాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే సమగ్ర నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు సమయత్తం అవుతున్నారు. కాగా నీటి సరఫరాకు కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...