ఆర్థికమాంద్యాన్ని దీటుగా ఎదుర్కొనగలం


Sat,October 5, 2019 12:57 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రపంచంలో శక్తిశాలి దేశంగా భారత్ అవతరిస్తున్నదని, ఆర్థికంగా కాస్త, ఒడిదుడుకులు ఎదుర్కొన్న మన ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమేమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఆర్థిక మందగమనాన్ని మన దేశం దీటుగా ఎదుర్కొనగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌లోని ఖాజామాన్షన్ ఫంక్షన్ హాల్లో కస్టమర్ ఔట్‌రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ... మన దేశం ఒకప్పుడు అప్పులెవరిస్తారా ? అని వేచి చూసేదని, ప్రస్తుతం చిన్న చిన్న దేశాలకు అప్పులిచ్చే స్థాయికి ఎదిగిందన్నారు. ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా మాత్రమే ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోగలదని, ముంచుకొస్తున్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు బ్యాంకుల వద్ద ఉన్న సంపదను వినియోగంలోకి తెచ్చి ఉత్పాదక రంగాన్ని పరుగులు పెట్టించేందుకే ఇలాంటి ఔట్‌రీచ్ మేళాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. లోన్ మొత్తంను వ్యాపారం కోసం వినియోగించి రూపాయి పెట్టుబడి పెట్టి, రెండు రూపాయలు సంపాదించుకునేలా ప్రయత్నించాలన్నారు. ఈ సందర్భంగా పలు బ్యాంకుల నుంచి మంజూరైన రుణాలను చెక్కుల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. కేంద్ర ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి మదేశ్‌కుమార్ మిశ్రా, నాబార్డు హైదరాబాద్ రీజియన్ జీఎం విజయ్‌కుమార్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ యూన్‌ఎన్ మయా, బ్యాంకుల ప్రతినిధులు మురళీకృష్ణ, రాజేందర్‌రెడ్డి, రమేశ్, రాజ్‌కుమార్ మిత్ర, టీఎస్ రవికుమార్, పి. శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...