భూ సమీకరణ పథకంలో ముందడుగు..


Fri,October 4, 2019 03:07 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : భూ సమీకరణ పథకం(ల్యాండ్ ఫూలింగ్ స్కీం) అమలులో కీలక అడుగు పడింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో భాగంగా ల్యాండ్ ఫూలింగ్ స్కీంను తెరపైకి తీసుకువచ్చిన హెచ్‌ఎండీఏ ఆసక్తి గల రైతులు(భూ యజమానుల) నుంచి దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు రెండున్నర నెలల పాటు గ్రామ సభల ద్వారా భూ సమీకరణ పథకం లక్ష్యాలపై అధికారులు వివరించారు. పలు ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు పథకం అమలు సాధ్యాసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగానే ప్రతాప సింగారం, దుండిగల్, బోగారం, మోఖిల ప్రాంతాల్లో భూ సమీకరణ పథకం అమలుకు వీలుగా, ముఖ్యంగా 50 ఎకరాలకు మించి స్థలాల లభ్యత ఉందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలో మంత్రి కేటీఆర్ భూ సమీకరణ పథకంపై ప్రత్యేకంగా చర్చించారు. తక్షణమే వీలుగా ఉన్న ప్రాంతాల్లో భూ సమీకరణ పథకం అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎంపిక చేసిన ఈ నాలుగు ప్రాంతాల నుంచి ఆయా స్థానిక రెవెన్యూ అధికారులతో హెచ్‌ఎండీఏ సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రతిపాదిత స్థలాల్లో న్యాయ వివాదాలు, ఇతర చిక్కులు లేకుండా ఉన్న స్థలాన్ని గుర్తించి రాబోయే రెండు రోజుల్లోగా ఆయా రెవెన్యూ అధికారులు హెచ్‌ఎండీఏకు నివేదిక ఇవ్వనున్నారు.

ఈ నివేదికకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాలకు తొలుత నోటిఫై చేసి ఆ తర్వాత సంబంధిత భూ యజమానుల(రైతులతో)అధికారులు చర్చలు జరుపుతారు. లీగల్ వెరిఫికేషన్, ప్లానింగ్ విభాగం, ఇంజినీరింగ్ విభాగం లే అవుట్ అభివృద్ధికి ప్లాన్ ఖరారు చేస్తారు. కాగా అన్నింటికంటే మించి అభివృద్ధిలో భూ యజమానులు భాగస్వామ్యం అవుతారని, ఈ పథకంలో చేరితే తాను ఇచ్చిన భూమిని సమానమైన భూమిని పొందడంతోపాటు నివాస యోగ్యమైన ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో కూడిన ప్లాట్లు దక్కనున్నాయని అధికారులు చెబుతున్నారు. రైతులంతా ఐక్యతతో ముందుకు వచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సభల ద్వారా ఇప్పటికే వివరించడం జరిగిందని అధికారులు తెలిపారు. భూములు కోల్పోకుండా అభివృద్ధి పథకంలో యజమానులు భాగస్వామ్యం అయితే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని, అభివృద్ధిపరిచిన ప్లాట్లు దక్కడంతో పాటు నిర్ధారిత వాటాల ప్రకారం భూమిని కేటాయించడం జరుగుతుందని చెబుతూ ఈ పథకంలో భాగస్వామ్యం చేస్తుండడం గమనార్హం.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...